దాదాపు ఏడాది కాలంగా… పచ్చపత్రికల హెడ్ లైన్స్ అన్నీ ఒకటే…
జగన్ కు కోర్టులో ఎదురుదెబ్బ
జగన్ కు చుక్కెదురు
జగన్ కు మొట్టికాయలు
జగన్ కు షాక్!
గత ఏడాదిలో ఇలాంటి వార్తలు తాటికాయంత అక్షరాల సైజులో అనేకసార్లు చూశాము. ఒకదశలో ప్రబుభుత్వానికి ఎలా ఉన్నదో కానీ, సాధారణ పౌరులలో కూడా ఒకరకమైన నిస్పృహ ఏర్పడింది. ఎందుకు ఇన్ని ఎదురు దెబ్బలు? దేశంలో మరే రాష్ట్రంలోనూ చూడని వింతలు ఒక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే సంభవిస్తున్నాయి. అది పాఠశాలల్లో ఆంగ్లమాధ్యమం విషయంలో కావచ్చు..భూముల కుంభకోణాల్లో కావచ్చు…నేరగాళ్ల మీద పెట్టిన కేసుల మీద కావచ్చు…అన్నీ ప్రభుత్వానికి వ్యతిరేకంగానే హైకోర్టు తీర్పులు వస్తున్నాయి.
సరే, వాటిలో ఏవైనా రాజ్యాంగపరమైన లొసుగులు, తప్పులు ఉన్నాయేమో అని సరిపెట్టుకోవచ్చు. కానీ, మన కళ్ళముందే ఒక ఆసుపత్రిలో…అది కూడా రోజుకు లక్ష రూపాయలు వసూలు చేసి వైద్యం చేసే రమేష్ ఆసుపత్రి లాంటి కార్పొరేట్ ఆసుపత్రి నిర్వహణలో సాగుతున్న కోవిద్ సెంటర్లో అగ్నిప్రమాదం సంభవించి పదిమంది అమాయక రోగులు ప్రాణాలు కోల్పోయిన హృదయవిదారక సంఘటన జరిగిన తరువాత….ప్రభుత్వం స్పందించి సదరు ఆసుపత్రి యాజమాన్యం మీద కేసులు పెడితే, అసలు వారిమీద విచారణ చెయ్యడానికి కూడా వీల్లేదని అత్యున్నత న్యాయస్థానం తీర్పు ఇస్తే ఇక సామాన్యప్రజలు ఎవరితో మొరపెట్టుకోవాలి? అలాగే మొన్న పెందుర్తి లో నూతన నాయుడు అనే ఒక వ్యక్తి ఇంట్లో పనిచేసిన యువకుడికి శిరోముండనం గావించి అత్యంత దారుణంగా పరాభవించిన కేసులో సాక్ష్యాధారాలతో సహా వెలుగులోకి వచ్చిన తరువాత కూడా అతని మీద విచారణ చేయరాదని తీర్పులు వస్తే దాన్ని ప్రజలు ఎలా జీర్ణించుకోవాలి? ఎలా అర్ధం చేసుకోవాలి?? ప్రభుత్వం మనకు ఏదైనా అపకారం చేస్తే, తప్పుడు కేసులు పెట్టి వేధిస్తే…మనల్ని రక్షించడానికి న్యాయస్థానం ఉన్నదనే ధైర్యం ఉంటుంది. కానీ, ఆ న్యాయస్థానమే మనకు అన్యాయం చేస్తే మనం ఎవరితో చెప్పుకోవాలి?
ఇక్కడ రమేష్ ఆసుపత్రి యాజమాన్య నిర్లక్ష్యం చాలా స్పష్టంగా కనిపిస్తున్నది. తమ తప్పులు లేకపోతే సదరు యజమాని డాక్టర్ రమేష్ ఎందుకు గత నెలరోజులుగా పరారీలో ఉన్నారు? ఆయన ఎందుకు పరారీ అయ్యారు అని హైకోర్టు ప్రశ్నించలేదు. బాధిత కుటుంబాలవారికి ఎలాంటి న్యాయం జరిగిందని విచారించలేదు. విశాఖపట్నం లోని ఎల్జీ పాలిమర్స్ లో జరిగిన ప్రమాదంలో పదిమంది మరణించినపుడు ఆ కంపెనీ డైరెక్టర్లను అరెస్ట్ చెయ్యాలని ఆదేశించిన కోర్ట్ రమేష్ ఆసుపత్రి వ్యవహారంలో అందుకు భిన్నంగా ఆదేశాలు ఎందుకు ఇచ్చిందో అర్ధం కాదు.
అలాంటి పరిస్థితిలో… మండువేసవిలో మల్లెల వర్షం కురిసినట్లు, ఎడారిలో ప్రయాణిస్తూ దాహంతో అలమటిస్తున్నవాడికి మంచినీటి సరస్సు కనిపించినట్లు…నిన్న రమేష్ ఆసుపత్రి కేసులో హై కోర్ట్ స్టే మీద స్టే ఇవ్వడమే కాక, ఆసుపత్రి యయమాన్యాన్ని విచారించవచ్చని గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జగన్మోహన్ రెడ్డికి గొప్ప ఉపశమనాన్ని ఇచ్చే అంశమే. అలాగే నాలుగు రోజుల క్రితం CRDA లో తాసిల్దార్ గా పనిచేసిన అధికారి అక్రమాలపై విచారణను అడ్డుకున్న హై కోర్ట్ తీర్పును కూడా సుప్రీమ్ కోర్ట్ పక్కన పెట్టి అతని మీద విచారణ జరపడానికి అనుమతి ఇవ్వడం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి శుభసూచకం అని చెప్పవచ్చు.
ఇక వేలకోట్ల రూపాయల రాజధాని భూ కుంభకోణం, రెండువేల రూపాయల ఫైబర్ గ్రిడ్ కుంభకోణంలో కూడా సిబిఐ విచారణను కోరుతూ వైసిపి ప్రభుత్వం కేంద్రాన్ని కోరడం కూడా స్వాగతించదగినదే. నిజానికి అయిదేళ్ల చంద్రబాబు పాలన మొత్తం కుంభకోణాల మయం. ఒక్కొక్క తెలుగుదేశం నాయకుడు కోట్ల రూపాయల ప్రజాధనాన్ని స్వాహా చేశారు. ఆ కుంభకోణాల మీద సిబిఐ తో విచారణ జరిపించి ప్రజాధనాన్ని కాపాడటం ప్రభుత్వ కర్తవ్యమ్.
ఈ విషయం మీద వైసిపి ఎంపీలు నేడు పార్లమెంట్ లో ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తారని వార్తలు వస్తున్నాయి. పోలవరంలో ఎంతో అవినీతి జరిగిందని సాక్షాత్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఒక బహిరంగసభలో పేర్కొన్నారు. కాబట్టి రాష్ట్రం కోరినట్లుగా సిబిఐ దర్యాప్తు నిర్వహించి నేరగాళ్ళను కటకటాల వెనక్కు నెట్టడానికి కేంద్రం కూడా సహకారం అందించాలి. రాజకీయాల్లో అవినీతిని సమూలంగా నిర్మూలించాలి.
ఇలపావులూరి మురళీ మోహన రావు
సీనియర్ రాజకీయ విశ్లేషకులు