సాలు మోదీ.! సంపకు మోదీ.! ఇదా సంస్కారం.?

తెలంగాణ రాష్ట్ర సమితికీ, భారతీయ జనతా పార్టీకీ నడుమ రాజకీయ పోరు అనూహ్యమైన రీతిలో జరుగుతోంది. కానీ, ఇదంతా నిజమేనా.? జరుగుతున్న కథ వెనుక చిత్ర విచిత్రమైన రాజకీయ స్నేహాలు ఏమీ లేవా.? అంటే, ‘లేవు’ అని బల్లగుద్ది చెప్పలేని పరిస్థితి.

మోడీ సర్కారుని పలు సందర్భాల్లో సమర్థించి, కొన్ని సందర్భాల్లో విబేధిస్తూ వచ్చింది తెలంగాణ రాష్ట్ర సమితి. అదే, తెలంగాణ రాష్ట్ర సమితి మీద పలు అనుమానాలకు ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు.

హైద్రాబాద్‌లో మోడీకి ‘గులాబీ’ స్వాగతం.! ఇది కాస్త వెరైటీ.!
‘సాలు మోదీ.. సంపకు మోదీ..’ అంటూ గులాబీ శ్రేణులు హైద్రాబాద్ వ్యాప్తంగా ఫ్లెక్సీలు, పోస్టర్లు ఏర్పాటు చేస్తున్నాయి. పెద్ద నోట్ల రద్దు దగ్గర్నుంచి, కోవిడ్ లాక్ డౌన్ వరకు.. చాలా అంశాల్ని ప్రస్తావిస్తూ ఈ పోస్టర్లు ఏర్పాటవుతున్నాయి.

నిజానికి, వాటిల్లో చాలా నిర్ణయాలకు తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీయార్ కొంతమేర మద్దతు కూడా పలికారు కేంద్రానికి. అలాంటప్పుడు, ఈ ఫ్లెక్సీల యుద్ధమేంటి.? ఏమోగానీ, ప్రధాని నరేంద్ర మోడీ తెలంగాణకు వస్తున్న సందర్భంలో ఈ తరహా పోస్టర్లు సమర్థనీయం కాదు. అది తెలంగాణ సమాజానికి గౌరవం కాదు.

రాజకీయంగా ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవచ్చు. కానీ, దానికి ఇది పద్ధతి కాదు. అలాగే, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీయార్ మీద వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ బీజేపీ ఫ్లెక్సీలు కట్టడాన్నీ సమర్థించలేం. ఇద్దరూ ఒకర్ని మించి ఒకరు తమ స్థాయిని దిగజార్చేసుకుంటున్నారు.