దేశ రాజకీయాల్లో ఎప్పుడూ ఎక్కడా చూడని వింత.. దుబ్బాక ఉప ఎన్నిక సందర్భంగా కనిపిస్తోంది. సిట్టింగ్ ఎమ్మెల్యే అనారోగ్యంతో కన్నుమూయడంతో వచ్చిన ఈ ఉప ఎన్నిక కోసం అదికార టీఆర్‌ఎస్ నానా తంటాలూ పడుతున్న విషయం విదితమే. సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకోవడానికి అధికార పార్టీ కష్టాలు పడటం అందర్నీ విస్మయానికి గురిచేస్తోంది. కాంగ్రెస్ పార్టీ నుంచి అభ్యర్థి బరిలో వున్నప్పటికీ, ప్రధానంగా పోటీ మాత్రం టీఆర్‌ఎస్ – బీజేపీల మధ్యనే అన్నట్లుగా వుంది. టీఆర్‌ఎస్, రాష్ట్రంలో తనకున్న అధికారాన్ని అడ్డంపెట్టుకుని దుబ్బాకలో గెలవడానికి ప్రయత్నిస్తోంటే, దేశంలో అధికారం తమదేనన్న అహంకారం బీజేపీ శ్రేణుల్లో స్పష్టంగా కనిపిస్తోంది.
గులాబీ వర్సెస్ కమలం.. ఎవరిది పై చేయి.?
సాధారణంగా ఉప ఎన్నిక అంటే, రాష్ట్రంలో అధికారంలో వున్న పార్టీకి అడ్వాంటేజ్ ఎక్కువ. అధికార ప్రయోగం, ధన ప్రయోగం.. ఇంకా చాలానే వుంటాయి. చాలా ఉప ఎన్నికల్లో ఇలాంటి పరిస్థితుల్ని చూశాం. గతంలో ఇంతకన్నా ‘టఫ్ ఫైట్’ జరిగిన సందర్భాలున్నాయి. కానీ, ఈసారి ఇటు టీఆర్‌ఎస్, అటు బీజేపీ.. ‘నువ్వా.? నేనా.?’ అన్నట్లు తలపడుతుండడంతో పరిస్థితి ఒకింత జుగుప్సాకరంగా మారిపోయింది. ఇక్కడ ఎవరిది తప్పు.? అని తేల్చడం అంత తేలిక కాదు. గెలుపు నల్లేరు మీద నడకే.. అనుకుంటోన్న టీఆర్‌ఎస్‌కి, బీజేపీ రూపంలో పెద్ద పోటీ ఎదురయ్యేసరికి.. గులాబీ శ్రేణులు జీర్ణించుకోలేకపోతున్నాయి. గులాబీ శ్రేణుల్ని నిలువరించే క్రమంలో బీజేపీ, తన శక్తియుక్తులన్నీ ప్రదర్శించాల్సి వస్తోంది.
రాష్ట్ర ప్రభుత్వం వర్సెస్ కేంద్ర ప్రభుత్వం.!
గులాబీ శ్రేణులేమో, రాష్ట్రంలో తమదే అధికారం గనుక, దుబ్బాక ఉప ఎన్నికలో తాము ఏం చేసినా చెల్లిపోతుందనే భావనతో కనిపిస్తున్నాయి. ఎక్కడికక్కడ బీజేపీ శ్రేణుల్ని టీఆర్‌ఎస్ శ్రేణులు రెచ్చగొడుతున్నాయి. ఇక్కడే, బీజేపీ.. ఈ ఉప ఎన్నికను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకోవడానికి బీజం పడిందని అనుకోవాలి. నిజానికి, బీజేపీ.. దుబ్బాక ఉప ఎన్నికను అంత సీరియస్‌గా తీసుకునేదే కాదేమో.. గులాబీ అత్యుత్సాహం లేకపోతే. ఎప్పుడైతే, రాష్ట్రంలోని అధికార పార్టీ.. తన అధికారాన్నంతా దుబ్బాక ఉప ఎన్నికపై రుద్దడం మొదలు పెట్టిందో.. బీజేపీ కూడా, తన అధికారాన్ని ఇక్కడ మోహరించాలనే ఆలోచన చేస్తున్నట్లు కనిపిస్తోంది. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, దుబ్బాక ఉప ఎన్నికను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు.
నలిగిపోతున్న అధికారులు..
‘టీఆర్‌ఎస్‌కి చెంచాగిరీ చేస్తున్నారు.. టీఆర్‌ఎస్ కార్యకర్తల్లా వ్యవహరిస్తున్నారు..’ అంటూ అధికారులపై బీజేపీ విమర్శలు చేస్తోంది. ఇది చాలా చోట్ల జరిగే వ్యవహారమే. కానీ, ఈసారి ఇంకాస్త ఎక్కువగా వుంది ఆరోపణల పర్వం. మరోపక్క, ‘కేంద్ర ప్రభుత్వం, రాష్ట్రంపై పెత్తనం చేయాలనుకుంటే కుదరదు.. అధికారుల్ని బ్లాక్‌మెయిల్ చేస్తామంటే ఒప్పుకోం..’ అంటోంది టీఆర్‌ఎస్. ఇలా.. టీఆర్‌ఎస్, బీజేపీ మధ్య అధికార యంత్రాంగం నలిగిపోతోంది. ఒక్కమాటలో చెప్పాలంటే, దుబ్బాక ఉప ఎన్నిక.. దుబ్బాక ప్రజల్నే ఆశ్చర్యపరుస్తోంది. గెలిచి ఏం సాధిస్తారు.? గెలవడం ద్వారా రాష్ట్రంలో అధికారం మారిపోతుందా.? దేశంలో అధికారం మారిపోతుందా.? అని దుబ్బాక ఓటరు ప్రశ్నిస్తుండడం గమనార్హం.