నేదురుమల్లి కోటలో రహస్య చర్చలు, టికెట్ మీద పెరిగిన ఉత్కంఠ

నెల్లూరుజిల్లా  వెంకటగిరిలో ప్రతిపక్ష వైసిపి పరిస్థితి ఆసక్తికరంగా ఉంది. దీనికి కారణం కారణం మాజీ ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్దన్ రెడ్డి కుమారుడు రాంకుమార్ రెడ్డి బిజెపి వదిలేసి వైసిపిలో చేరడమే. ఫలితంగా వెంకటగిరి వైసిపి సీటు ఎవరికి అనే ప్రశ్న మొదలయింది. ఈ సీటు కోసం పోటీ మొదలయింది. గ్రూపులు మొదలయ్యాయి.  అయితే, వెంకటగిరి పార్టీలో  ్రగూపులు లేవని చెప్పేందుకు  నేతలనందరితో పార్టీ సీనియర్ నాయకులు సమావేశమయ్యారు. ఒక ప్రకటన కూడా చేశారు.

ఒక  ప్రైవేటు కార్యక్రమానికి విచ్చేసిన  వైస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా ఇంచార్జ్  సజ్జల రామకృష్ణారెడ్డి, తిరుపతి పార్లమెంటు సభ్యులు డాక్టర్ వెలగపల్లి వరప్రసాద్ ముందుగా  బొమ్మిరెడ్డి నివాసంలో సమావేశమయ్యారు.

ఈ సమావేశంలో బొమ్మిరెడ్డి, కలిమిలితో… జిల్లా ఇంచార్జ్, తిరుపతి ఎం.పి. ప్రత్యేకంగా సమావేశమై చాలా సేపు  సమాలోచనలు జరిపారు.  అనంతరం బొమ్మిరెడ్డి నివాసం నుంచి, వైసీపీ నేతలంతా  నేదురుమల్లి బంగ్లా చేరుకున్నారు.  అక్కడ వారికి  రాంకుమార్ రెడ్డి స్వాగతం పలికారు.

అనంతరం సజ్జల రామకృష్ణారెడ్డి, తిరుపతి ఎంపి డాక్టర్ వరప్రసాద్, నేదురుమల్లి రాంకుమార్ రెడ్డి, బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డి, కలిమిలి రాంప్రసాద్ రెడ్డి మరొదఫా చర్చలు జరిపారు. తర్వాత  ఒకే వేదికపైకి వచ్చి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి, వెంకటగిరి నియోజకవర్గంలో ఎటువంటి వర్గపోరు లేదని, అందరం కష్టపడి పార్టీ కార్యక్రమాలు చేస్తున్నామని, 2019 ఎన్నికల్లో జగన్ ను ముఖ్యమంత్రి చేయడమే మా లక్ష్యమని, వెంకటగిరి వైసీపీ టికెట్ ఏ అభ్యర్థికి ఇచ్చినా, అందరం కలిసి పనిచేస్తామని ప్రకటించారు.

అయితే,  ఈ సమావేశాల వల్ల , ఈ క్లారిఫికేషన్ వల్ల వెంకటగిరి నియోజకవర్గం మీద  ఇంకా ఉత్కంఠ పెరిగిందే తప్ప తగ్గలేదు.   వైసిపీ సీనియర్లు  నేదురుమల్లి కోటలో ఒక్కసారిగా ప్రత్యక్షం అవ్వడంతో రకరకాల వూహాగానాలకు కారణమయింది.   వెంకటగిరి వైసిపి టికెట్ ఏ అభ్యర్థికి దక్కనుంది, రాం కుమార్ రెడ్డికి టికెట్ హామీ ఇచ్చారా లేక ఈ సారి కాదులే టికెట్ అడగొద్దు, నీకు మరొక సహాయం చేస్తామని నచ్చచెప్పారా అనేది ఇపుడు చర్చనీయాంశమయింది.

ఇదీ కారణం

వెంకటగిరి సీటు కోసం ఎంత పోటీ వుందో చూడండి. ఈ నియోజవకర్గంలో చాలా కాలం నుంచి పార్టీలో ఉంటూ పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటున్న  ఇద్దరు నాయకులు టికెట్ కోసం పోటీ పడుతున్నారు. వారు  వైసిపి నియోజకర్గం ఇన్ చార్జి బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డి, అదేవిధంగా యాక్టివ్ గా ఉన్న పారిశ్రామికవేత్త  కలిమిలి రాం ప్రసాద్ రెడ్డి. ఇక మూడో వ్యక్తి  నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి  కూాడా ఇపుడు రంగంలోకి దూకారు. ఆయన బిజెపి వదిలేసి వైసిపిలోకి వచ్చారు.  వీరికితోడు ఆనం రామ్ నారాయణ్ రెడ్డి తొొందర్లో పార్టీలో చేరాలనుకుంటున్నారు. ఆయన ఆత్మకూరు లేకుంటే వెంకటగిరి టికెట్ కావాలంటున్నారని చెబుతున్నారు.