పాపం..రెంటికీ చెడిన రాధా

పాపం వంగవీటి రాధాకృష్ణకు దిమ్మ తిరిగింది. ఏదో చేద్దామని అనుకుంటే ఇంకేదో అయ్యింది. రాధా వేసిన ఓ రాంగ్ స్టెప్ తో రాజకీయ జీవితమే అగమ్యగోచరంగా తయారైంది. వైసిపి నుండి వచ్చేసిన తర్వాత టిడిపి తరపున వస్తుందని అనుకున్న ఎంఎల్సీ కూడా రాలేదు. దాంతో చంద్రబాబునాయుడు రాజకీయమేంటో అర్ధం అయ్యేటప్పటికి రాధాకు దిమ్మతిరిగి బొమ్మ కనబడుతోంది.

నిజానికి రాధాకు జగన్ అన్నీ విధాలుగా అండగా నిలబడ్డాడనే చెప్పాలి. వైసిపి యువజన అధ్యక్ష పదవి ఇచ్చారు. దాని తర్వాత విజయవాడ అధ్యక్ష పదవి కూడా ఇచ్చారు. ఏ పదవి ఇచ్చినా రాధా ఊడబీకిందేమీ లేదు. పదవులు తీసుకోవటమే తప్ప క్రియాశీలంగా పని చేసిందే లేదు. దాంతో రాధాకు నాయకత్వానికి బాగా గ్యాప్ వచ్చేసింది.

ఈ పరిస్ధితుల్లోనే రాధాను జగన్ విజయవాడ తూర్పు నుండి కానీ లేకపోతే మచిలీపట్నం లోక్ సభ నుండి కానీ పోటీ చేయమని అడిగారు. కానీ రాధా దృష్టంతా విజయవాడ సెంట్రల్ మీదే ఉంది. దాంతో జగన్ ఆఫర్ ను కాదన్నారు. ఇదే అదునుగా టిడిపి నేతలు ఎంటరై రాధాను గోకారు. దాంతో రాధా కూడా వాళ్ళ మాయలో పడి వైసిపికి రాజీనామా చేసేశారు.

ఎప్పుడైతే రాధా వైసిపిలో నుండి బయటకు వచ్చేశారో సెంట్రల్ టికెట్ కు బదులు టిడిపిలో చేరగానే ఎంఎల్సీ పదవి ఇస్తానని చంద్రబాబు ఆఫర్ ఇచ్చారు. వేరే దారిలేక రాధా కూడా సరే అన్నారు. మొత్తానికి రాధా టిడిపిలో చేరలేదు, రాధాకు చంద్రబాబు ఎంఎల్సీ పదవి హామీనీ నిలుపుకోలేదు. అంటే రాధా పరిస్ధితి రెంటికి చెడ్డ రేవడిగా అయిపోయింది.