తనను తాను చాలా ఎక్కువగా ఊహించేసుకున్నాడా ?

కొందరంతే తమను తాము ఎక్కువగా ఊహించేసుకుంటుంటారు. లేస్తే మనిషిని కాదన్నట్లు కొంత కాలం నెట్టుకొచ్చేస్తారు. తీరా లేవాల్సిన సమయం వచ్చేసరికి బోర్లా పడిపోతారు.  ఇదంతా ఎందుకంటే,  వంగవీటి రాధా కృష్ణమూర్తి గురించి చెప్పటానికే.

ఏదో తండ్రి వంగవీటి రంగా పేరు చెప్పుకుని బతికిపోవటమే తప్ప తనకంటూ సొంత అస్తిత్వాన్ని డెవలప్ చేసుకున్నది లేదు. ఏ పార్టీలో ఉన్నా కష్టపడి పనిచేయటమన్నదే లేదు. వైసిపిలో ఉన్నపుడు వైసిపి యువజన విభాగం అధ్యక్షునిగా పనిచేశారు. ఏ రోజు కూడా పట్టుమని జిల్లాలో నాలుగు రోజులు కూడా పార్టీ కోసం తిరిగింది లేదు.

మూడు ఎన్నికల్లో పోటీ చేసి  ఒకసారి మాత్రమే గెలిచారంటేనే రాధా పట్టేంటో తెలిసిపోతోంది. అలాంటిది జగన్మోహన్ రెడ్డి చెప్పినట్లు మచిలీపట్నమో లేకపోతే విజయవాడ తూర్పు నియోజకవర్గంలోనో పోటీ చేయటానికి ఒప్పుకునుంటే సరిపోయేది. కానీ విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం కోసమే పట్టుబట్టి చివరకు టికెట్ రాదని అర్ధమైపోయి వైసిపికి రాజీనామా చేసి టిడిపిలో చేరారు.

పోనీ టిడిపిలో అయినా టికెట్ తెచ్చుకున్నారా అంటే అదీ లేదు. ఏదో ఓ రెండు రోజులు ప్రచారం చేసి జగన్ ను సిఎం కానిచ్చేది లేదంటు హూంకరించారు. జగన్ కు వ్యతిరేకంగా నోటికొచ్చినట్లు మాట్లాడారు. సీన్ కట్ చేస్తే వైసిపిని ఓడించేందుకు రాధా ప్రయత్నించిన విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో వైసిపినే గెలిచింది. పైగా జగన్ సిఎం అవుతున్నారు. దాంతో రాధా ఏం సాధించినట్లు ? అన్నదే ఎవరికీ అర్ధం కాలేదు. అంటే తనను తాను రాధా చాలా ఎక్కువగా ఊహించేసుకున్నారని అర్ధమైపోయింది.