పవన్ లో అయోమయం..ఇపుడు పర్యటనలెందుకు ?

జనసేన అధినేత పవన్ కల్యాణ్ తీసుకుంటున్న నిర్ణయాలు ఆ పార్టీ నేతలనే అయోమయంలో పడేస్తున్నాయ్.  పోలింగ్ ముగిసిన తర్వాత దాదాపు వారంపాటు ఎవరికీ అందుబాటులోకి రాకుండా పవన్ హౌడ్ అవుట్ లో ఉండిపోయారు. తాజాగా అభ్యర్ధులతో సమావేశమైన పనవ్ తొందరలో కృతజ్ఞతా పర్యటనలు చేయనున్నట్లు చెప్పి గందరగోళంలో పడేశారు.

ఇపుడు 13 జిల్లాల్లోను కృతజ్ఞతా పర్యటనలు ఎందుకో ఎవరికీ అర్ధంకాలేదు. కౌంటింగ్ కు మరో 27 రోజులుంది. మే 23వ తేదీన ఫలితాలు వచ్చిన తర్వాత జనేసేన అభ్యర్ధులు గెలిచినా గెలవకపోయినా జనాలు ఓట్లేసినందుకు కృతజ్ఞతగా పర్యటించారంటే అర్ధముంటుంది. అసలు ఎన్నికల సమయంలోనే పవన్ అన్నీ జిల్లాల్లోనూ పూర్తిగా తిరగలేదు. అలాంటిది ఇపుడు పర్యటనలు ఏమిటో ఎవరికీ అర్ధం కావటం లేదు.

ఎన్నికలకు ముందు పవన్ పర్యటనలంటే ఖర్చు మొత్తాన్ని ఆయా జిల్లాల్లోని నేతలే భరించుకున్నారు. అలాంటిది ఇపుడు మళ్ళీ పర్యటనలంటే ఖర్చులు ఎవరు పెట్టుకుంటారు ? మొన్నటి ఎన్నికల్లో ఖర్చులే తడిసిమోపెడయ్యుంటాయి. అలాంటిది మళ్ళీ వెంటనే ఖర్చులంటే భరించే స్ధితిలో అభ్యర్ధులు లేరు. పైగా గెలుస్తామనే నమ్మకం లేని అభ్యర్ధులు మళ్ళీ ఖర్చులంటే భరించటానికి ఇష్టపడరు కూడా.

నిజానికి జనసేన 140 నియోజకవర్గాల్లో పోటీచేసినా గట్టి పోటీ ఇచ్చేది మాత్రం ఓ 20 నియోజకవర్గాలుంటే గొప్పే. జనసేన తరపున గెలిచే అవకాశం ఎవరికైనా ఉందంటే అది గాజువాకలో పవన్ కు మాత్రమే. రాజోలు, తాడేపల్లిగూడెం నియోజకవర్గాల్లో గట్టి పోటీ ఇచ్చారని అంటున్నారు. అంతేకానీ గెలుస్తారని ఎవరూ అనుకోవటం లేదు. అలాంటి పరిస్దితిలో రేపు ఫలితాలు వచ్చిన తర్వాత పరిస్ధితిని బట్టి మీడియా సమావేశంలోనే ఓటర్లకు పవన్ కృతజ్ఞతలు చెబితే చాలని నేతలే అంటున్నారు.