పవన్ మరో తలతిక్క నిర్ణయం ?

చూస్తుంటే అలాగే ఉంది పవన్ తాజాగా తీసుకున్న నిర్ణయం. జనసేన తరపున ఓ పత్రికను పెట్టబోతున్నట్లు ప్రకటించారు. పవన్ ప్రకటనతో జనసేనలోని నేతలే ఆశ్చర్యపోతున్నారు. ఎందుకంటే పేరుకే జనసేన కానీ అందులో జనాలు లేరు సైన్యమూ లేదు. మరి ఈ పత్రిక ఎందుకో ఎవరికీ అర్ధం కావటం లేదు.

మొన్నటి ఎన్నికల్లో 130 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోటి చేస్తే గెలిచింది ఒక్క సీటు. అది కూడా రాజోలులో రాపాక వరప్రసాద్ సొంత బలంతో గెలిచారు. ఇక పార్టీ అధినేత పవన్ కల్యాణ్ గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. పవన్ పోటీ చేసిన భీమవరం, గాజువాక రెండు చోట్లా ఓడిపోయారు. ఇక పార్టీ గురించి చెప్పుకోవాల్సొస్తే పార్టీ పోటీ చేసిన సీట్లలో 100 సీట్లలో డిపాజిట్లే రాలేదు.

36 సంవత్సరాల ఘనమైన చరిత్ర కలిగిన తెలుగుదేశంపార్టీనే మొన్నటి ఘోర పరాజయం నుండి ఎలా బయటపడాలో దిక్కు తెలీకుండా అల్లాడుతోంది. పార్టీ నేతలు వైసిపి, బిజెపిలోకి జంప్ చేయటానికి రెడీ అయిపోతున్నారు. టిడిపితో పోల్చుకుంటే జనేసేనకు అసలు ఒక్క నియోజకవర్గంలో కూడా గట్టి క్యాడరే లేదు. అలాంటిది ఘోర ఓటమి తర్వాత పార్టీ తరపున పత్రిక పెడతానంటే ఎవరు పట్టించుకుంటారు?

పార్టీ నిర్ణయాలు, భావజాలం, ప్రణాళికలు ప్రజలకు ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు వీలుగా పత్రికలో కథనాలుంటాయట. మేధావుల అభిప్రాయాలకు తమ పత్రిక ఓ వేదిక కావాలని పవన్ కోరుకుంటున్నారు. అసలు ఏ విషయంపైనైనా పవన్ కే ఓ స్ధిరభిప్రాయమంటూ లేదు. అలాంటిది తన పత్రికలో మేధావులు అభిప్రాయాలు పంచుకోవాలని పిలుపివ్వటం భలేగా ఉంది. పార్టీ ప్రారంభించి ఎంత వైనంగ నడిపారో అందరూ చూశారు. ఇక పత్రిక నడుపుతారట. సరే కానీండి ముందు పత్రిక ప్రారంభమవ్వాలి కదా ? అప్పుడు చూద్దాం .