జనసేన మద్దతుదారులకి ఓ పవర్‌ఫుల్ డైలాగ్ దొరికింది.. అదే, ‘నువ్వు కూడానా’ అన్న డైలాగ్. అన్నటికీ ఒకటే మంత్రం. ముఖ్యమంత్రి దగ్గర్నుంచి మంత్రుల వరకు, ఎమ్మెల్యేల విషయంలోనూ జనసేన మద్దతుదారులు ఇదే డైలాగ్ ఎడా పెడా వాడేస్తున్నారు.
మొన్నటి రణస్థలం ‘జనసేన యువశక్తి’ కార్యక్రమంలో మంత్రి రోజాపై విమర్శలు చేసే క్రమంలో ‘డైమండ్ రాణీ.. నువ్వు కూడానా..’ అని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ‘తేలిక’ వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. అప్పటినుంచి జనసేన మద్దతుదారులు ఈ ‘మాటని’ ట్రెండింగ్‌లోకి తెచ్చేశారు. ‘నువ్వు కూడానా.?’ అంటూ వైసీపీ నేతల మీద ప్రయోగించేస్తున్నారు.
సరే, జనసేన అధినేతకి సినిమా నటుడిగా విపరీతమైన ఫాలోయింగ్ వుంది గనుక, ఆ సినీ అభిమానులైన జనసైనికులు, సోషల్ మీడియాలో ఇలాంటివాటిని ట్రెండింగ్ చేయగలరు. కానీ, ‘నువ్వు కూడానా.?’ అన్న మాట పవన్ కళ్యాణ్‌కి వర్తించకుండా వుంటుందా.?
నిజానికి, అది వర్తించేదే ‘పవన్ కళ్యాణ్’కి’.! ‘వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిని అవనివ్వను..’ అని గతంలో పవన్ కళ్యాణ్ నినదించారు. కానీ, వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా అసెంబ్లీలో వుంటే, పవన్ కళ్యాణ్ అసెంబ్లీ గేటు కూడా తాకలేకపోయారు.
రాజకీయాల్లో గెలుపోటములు సహజం. అది పెద్ద విషయమేమీ కాదు. కానీ, ఓడిన వ్యక్తి.. గెలిచి అధికారంలో వున్నవారిని ఉద్దేశించి ‘నువ్వు కూడానా.?’ అంటూ గేలి చేయడం ఎంతవరకు సబబు.?