తెలంగాణ టిడిపికి షాక్… గులాబీ గూటికి చేరిన నామా

తెలంగాణ తెలుగు దేశానికి షాక్ తగిలింది. టిడిపి సీనియర్ నేత నామా నాగేశ్వరరావు టిడిపికి రాజీనామా చేసి టిఆర్ ఎస్ లో చేరారు. టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఆధ్వర్యంలో ఆయన గులాబీ కండువా కప్పుకున్నారు.

నామాతో పాటు టిడిపి రాష్ట్ర ఉపాధ్యక్షురాలు స్వర్ణకుమారి, అమర్ నాథ్, ఖమ్మం జిల్లా టిడిపి అధ్యక్షుడు బ్రహ్మయ్య, మంచిర్యాల టిడిపి అధ్యక్షుడు శరత్ బాబు, ఖమ్మం తెలుగు యువత అధ్యక్షుడు హరికృష్ణ నామాతో పాటుగా కారెక్కారు.

ఈ సందర్భంగా నామా మాట్లాడారు. ఆయన ఏమన్నారంటే…

“ఖమ్మం జిల్లాలో టిఆర్ఎస్ పార్టీ బలోపేతానికి నా వంతు కృషి చేస్తాను. అందరిని ఓ సోదరుడిలా కలుపుకుపోతాను. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు పార్లమెంటులో తెలంగాణ బిల్లు పై తొలి ఓటు నేనే వేశాను.

రాష్ట్రాభివృద్ది జరగాలి. ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలన్న సంకల్పంతోనే నేను టిఆర్ఎస్ లో చేరాను. రాబోయే కాలంలో కేసీఆర్ కు అండగా ఆయన ఆదేశాలకు అనుగుణంగా పని చేస్తాను.” అని నామా అన్నారు.