ఆ నాయకులు సేఫ్.. లోకేష్ మాట విన్న కార్యకర్తలు బలి!

వారి వారి అవసరాల కోసం నాయకులు చేసే ఊకదంపుడు ప్రసంగాలు.. వారి వారి స్వార్ధ ప్రయోజనాల కోసం కార్యకర్తలను రెచ్చగొడుతూ వారు ఇచ్చే స్టేట్ మెంట్లు వినాలే తప్ప, బ్లైండ్ గా ఫాలో అయిపోకూడదని చెబుతున్నాయి తాజా పరిస్థితులు. ప్రధానంగా ఏపీలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ముగిసినప్పటి నుంచి జరుగుతున్న పరిణామాలు ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయని అంటున్నారు. ఆ వివరాలేమిటో ఇప్పుడు చూద్దాం…!

అవును… ప్రస్తుతం ఏపీలో ఎన్నికల సమయంలో జరిగిన కొట్లాటలు, వాటి తాలూకు కేసులు, బెయిల్లు, శిక్షలు అనేవి ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. అయితే… ఈ వ్యవహారాల్లో ఇదంత ఎవరి కోసం జరిగిందో ఆ నాయకులు సేఫ్ గా ఉండగా.. ఆ నాయకుల మాటలు విన్న కార్యకర్తలు మాత్రం బలైపోతున్నారు. ఎన్నికల ప్రచార సమయంలో చినబాబు నారా లోకేష్ చేసిన వ్యాఖ్యలు దాదాపుగా అందరికీ గుర్తుండే ఉంటాయి.

ఏ కార్యకర్తపై ఎక్కువ కేసులు ఉంటాయో.. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత వారికి పెద్ద పెద్ద పదవులు ఇస్తాము అని! ఇది విని చెలరేగిపోయారో.. లేక, అలవాటులో పొరపాటుగా జరిగిపోయిందో ఏమో కానీ.. ప్రస్తుతం కార్యకర్తలు అనబడేవారు జైలల్లో మగ్గిపోతున్నారు. ఏ రాజకీయ పార్టీలోనైనా సరే నాయకులు తమపై ఎన్ని కేసులు, అభియోగాలు ఉన్నా దర్జాగా ఉంటున్నారు. హాయిగా బెయిల్ సంపాదించుకోగలుగుతున్నారు.

కానీ వారి కోసం అని, పార్టీల కోసం అని ఆవేశాలు పెంచేసుకుని.. వారి తరఫున ఘర్షణలు, అల్లర్లల్లో పాల్గొంటున్న కార్యకర్తలు మాత్రం తమ జీవితాలను బలి చేసుకుంటున్నారు. పలు కేసుల్లో చిక్కుకుని ఇబ్బందులు పడుతున్నారు.. తమ తమ కుటుంబాలను ఇబ్బందులు పెడుతున్నారు. వాస్తవానికి… రాజకీయ అల్లర్లు, ఘర్షణల్లో తలపడే కార్యకర్తల్లో ఎక్కువ మంది సామాన్యులే ఉంటారు!

వీరు కేసుల్లో చిక్కుకుంటే లక్షల రూపాయలు ఖర్చు చేసి హైకోర్టు వరకూ వెళ్లలేరు.. ఖరీదైన న్యాయవాదులను పెట్టుకోలేరు. దీంతో రోజుల తరబడి జైల్లో మగ్గిపోవాల్సిన పరిస్థితి. సంవత్సరాల తరబడి ఆయా కేసుల విచారణ కోసం కోర్టుల చుట్టూ తిరుగుతూ జీవితాలను నాశనం చేసుకునే దౌర్భాగ్య పరిస్థితి! ఫలితంగా… వారి కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. ఈ విషయాలను గ్రహించగలిగే ఆలోచనా శక్తి సదరు కార్యకర్తలు, అనుచరులు అనబడేవారికి లేకపోతుంది!

ఉదాహరణకు పోలింగ్‌ రోజు ఆ తర్వాత పల్నాడు జిల్లాలో జరిగిన హింసాకాండలో ఇప్పటివరకూ సుమారు 100మంది అరెస్టవ్వగా… కేవలం 20 మందికి మాత్రమే బెయిల్ దక్కింది. మిగిలిన 80మంది సుమారు 10 రోజులుగా జైల్లోనే మగ్గుతున్నారు.

ఇదే సమయంలో… అనంతపురం జిల్లా తాడిపత్రిలో ఘర్షణలకు సంబంధించి నమోదైన 7 కేసుల్లోనూ ఇప్పటివరకూ 102 మంది అరెస్టవ్వగా… వారిలో ఏ ఒక్కరికీ బెయిల్ దక్కలేదు. ఫలితంగా వారంతా 10రోజులుగా జైల్లోనే ఉన్నారు.

గతేడాది ఆగస్టులో పుంగనూరులో చంద్రబాబు పర్యటన సందర్భంగా చోటుచేసుకున్న ఘటనల్లో వందల మందిపై కేసులు పెట్టి 300 మందిని అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. అయితే ఆ వ్యవహారంలో వారంతా సుమారు 45 రోజుల పాటు జైల్లోనే గడిపారు.

తిరుపతిలోని పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం వద్ద టీడీపీ అభ్యర్థి పులివర్తి నానిపై జరిగిన హత్యాయత్నం ఘటనలో 13 మందిపై కేసు నమోదైంది. వీరిలో ఒక్కరికీ బెయిల్‌ రాలేదు. ఫలితంగా… అందరూ పది రోజులుగా జైల్లోనే ఉన్నారు.

ఇవి మచ్చుకు కొన్ని ఉదాహరణలు మాత్రమే. ఏ గొడవ జరిగినా, ఎలాంటి అల్లర్లు జరిగినా.. నాయకులు సేఫ్ గానే ఉంటారు, కార్యకర్తలు బలైపోతూ ఉంటారు. ఎక్కువ కేసులు ఉన్నవారికి పెద్ద పెద్ద నామినేటెడ్ పోస్టులు అనే మాటలూ మాట్లాడటం ఎంత పాపమో.. అవి పాటించడం అంతకు మించి!!