వైజాగ్ ఎయిర్పోర్ట్ లాంజ్ లో వెయిట్ చేస్తున్న ఏపీ ప్రతిపక్ష నేత జగన్ పై దాడి జరిగింది. ఈ ఘటనలో జగన్ కు స్వల్ప గాయం అయింది. ఈ ఘటనతో రెండు రాష్ట్రాలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాయి. కాగా జగన్ ను పరామర్శించడానికి తెలంగాణ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కెసిఆర్ ఫోన్ చేశారు. ఘటనపై ఆరా తీశారు.
జగన్ కు ఫోన్ చేసిన కెసిఆర్ దాడికి సంబంధించిన వివరాలు అడిగి తెలుసుకున్నారు. గాయం తీవ్రత, చికిత్స విధానంపై వివరాలు కనుక్కున్నారు. గాయం మానేవరకు రెస్ట్ తీసుకోవాలని సూచించారు. జగన్ కి తెలంగాణ ప్రభుత్వం తరపున భద్రత కల్పిస్తామని జగన్ కి హామీ ఇచ్చినట్టు తెలుస్తోంది. జగన్ దాడిపై స్పందించిన కెసిఆర్ బహిరంగంగా మాట్లాడుతూ కూడా తెలంగాణ ప్రభుత్వం తరపున భద్రత కల్పిస్తామని ప్రకటించారు. హైదరాబాద్ సిటీ న్యూరో సెంటర్ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారు.
కాగా జగన్ పై దాడి చేసిన వ్యక్తి ఎయిర్పోర్టు హోటల్ లో పని చేసే వెయిటర్ శ్రీనివాస్. అతడిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించగా తాను వైసీపీ అభిమానినని తెలపడం విశేషం. 2014 లోనే జగన్ సీఎం అవుతాడు అనుకున్నాను కానీ జరగలేదు. ఇలా చేస్తే సింపతితో ఈసారైనా జగన్ గెలుస్తారని చేశాను అని చెప్పడం గమనార్హం. మరోవైపు శ్రీనివాస్ కుటుంబసభ్యులు కూడా శ్రీనివాస్ జగన్ అభిమాని అని, ఇలా ఎందుకు చేశాడో అర్ధం కావట్లేదని ఆవేదన చెందారు.
ఈ ఘటనపై జగన్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆందోలనలు చేపడుతున్నారు. వైసీపీ నేతలు అధికార ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నారు. జగన్ కి సరైన భద్రత కల్పించడంలో బాధ్యతలు సక్రమంగా నిర్వర్తించలేదని, దాని ఫలితమే ఈ ఘటన అంటూ మండి పడుతున్నారు. ఈ విమర్శలను టీడీపీ నేతలు ఖండిస్తున్నారు. మీ కార్యకర్త దాడి చేస్తే దానిని ప్రభుత్వానికి ఆపాదిస్తే ఊరుకోమని స్పష్టం చేశారు.
