ప్రబోధానంద విషయంలో జేసీ సంచలన నిర్ణయం

ప్రబోధానంద స్వామీజీ గురించి సంచలన విషయాలు చెప్పారు టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి. మంగళవారం అసెంబ్లీకి వచ్చిన జేసీ తాడిపత్రి వివాదంపై స్పందించారు. ప్రబోధానంద స్వామిజి రూపంలో దౌర్జన్యాలు చేస్తున్నారన్నారు. పార్టీలకు, కులమతాలకు అతీతంగా స్వామీజీ బాధితులు ఉన్నారని ఆయన వెల్లడించారు. స్వామీజీ విషయంలో నేను గెలిచానో లేదా ఓడిపోయానో మీడియానే చెప్పాలి అన్నారు.

తాడిపత్రి చిన్న పొలమాడలో జరిగిన ఘటనతో ఒక్కసారిగా ఉద్రిక్తత నెలకొంది. గణేష్ నిమజ్జనం ఆశ్రమం ముందు నుండి వెళ్లరాదంటూ ఆశ్రమవాసులు వాగ్వాదానికి దిగారు. ఇది కాస్తా తీవ్ర ఘర్షణకు దరి తీసింది. ఒకరిపై ఒకరు దాడికి దిగారు. ఈ దాడిలో వినాయకుడిని ఉంచిన ట్రాక్టర్ కు ఆశ్రమంలోని వ్యక్తులు నిప్పంటించగా ఈ ఘటనలో గ్రామస్థుల్లోనూ ఒకరు మృతి చెందారు.

రెండు రోజులపాటు గ్రామస్థులకు, ఆశ్రమ వర్గాలకి మధ్య ఘర్షణలు జరిగాయి. జేసీ దివాకర్ రెడ్డి గ్రామస్తులపై దాడి చేసిన ప్రభోదానంద వర్గీయులపై చర్యలు తీసుకోవాలంటూ పోలీస్ స్టేషన్ ముందు ఆందోళనకు దిగారు. పోలీసులు జేసీ వర్గంతోనూ, ఆశ్రమం వర్గాలతోను చర్చలు జరిపి పరిస్థితులను శాంతపరిచారు. ఆశ్రమంలో ఆధార్ కార్డు ఉన్నవారిని, స్థానికులను మాత్రమే ఉంచి మిగిలిన వారిని వారి స్వస్థలాలకు పంపారు.

ఈ నేపథ్యంలో జేసీ దివాకర్ రెడ్డి ప్రభోదానంద వీడియోలు బయట పెడతాను అనటం ఆస్తిని రేపింది. ప్రబోధానంద స్వామిపై అనేక ఆరోపణలు ఉన్నాయి. ప్రబోధానందకు టీడీపీ ఎమ్మెల్యే ప్రభాకర చౌదరి మద్దతు ఉంది అనేది బహిరంగ నిజం. జేసీకి ప్రభాకర్ చౌదరికి పొసగదు అనేది అంతే బహిరంగ నిజం. అయితే స్వామీజీ ముసుగులో ప్రబోదానంద దుర్మార్గాలకు పాల్పడుతున్నాడు అనేది ప్రధాన ఆరోపణ.

ఈ నేపథ్యంలో ప్రభోదానంద వీడియోలు బయట పెడతా, పార్టీలకు, కులమతాలకు అతీతంగా స్వామీజీ బాధితులు ఉన్నారు అనటం హాట్ టాపిక్ అయ్యింది. ఒకవేళ ఆయన వీడియోలు బయట పెడితే ప్రబోధానందతోపాటు ప్రభాకర్ చౌదరిని కూడా ఈ వివాదంలోకి లాగుతారేమో అనే చర్చ నడుస్తోంది రాజకీయ వర్గాల్లో.