మళ్ళీ పోలీసులపై రెచ్చిపోయారు అనంతపూర్ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి. ఇటీవల పోలీసులను అవమానించేలా జేసీ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు పోలీసులు. పోలీసు అధికారుల సంఘం కూడా జేసీ వ్యాఖ్యలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.
అసభ్య పదజాలంతో జేసీ దివాకర్ రెడ్డి పోలీసు శాఖను కించపరిచారు. ఆయన క్షమాపణలు చెప్పాలి అంటూ పోలీసు అధికారుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. శాంతిభద్రతలు ఎక్కడ బాగుంటే అక్కడ అభివృద్ధి ఉంటుందన్న సీఎం చంద్రబాబు వ్యాఖ్యలకు దివాకర్ రెడ్డి తూట్లు పొడిచారని మండిపడ్డారు. ఇలాంటివి పునరావృతం కాకుండా చూడాలని ప్రభుత్వాన్ని కోరామని శ్రీనివాసరావు తెలిపారు.
జేసీ చేసిన వ్యాఖ్యలు మొత్తం పోలీసు వ్యవస్థనే కించపరిచేలా ఉన్నాయంటూ సీఐ గోరంట్ల మాధవ్ పేర్కొన్నారు. మాది కూడా రాయలసీమే, మేము కూడా అసభ్య పదజాలంతో మాట్లాడగలం. రాజకీయ నాయకుల కొమ్ము కాయడానికి పోలీసు వృత్తిలోకి రాలేదు. మాగోళ్లమై పోలీసు వృత్తిలోకి వచ్చినాము. జేసీ దివాకర్ రెడ్డి పోలీసు శాఖకు క్షమాపణలు చెప్పాలంటూ సీఐ గోరంట్ల మాధవ్ డిమాండ్ చేశారు. కదిరి సీఐ గోరంట్ల మాధవ్ ప్రెస్ మీట్ పెట్టి జేసీ కి వార్నింగ్ ఇచ్చారు. పోలీసుల ఆత్మస్థైర్యం దెబ్బతినేలా, కించపరిచేలా మాట్లాడితే నాలుకలు తెగ్గోస్తాం అంటూ ఫైర్ అయ్యారు. దీనికి సంబంధించిన వీడియో కింద ఉంది చూడవచ్చు.
దీనిపై స్పందించిన జేసీ దివాకర్ రెడ్డి శుక్రవారం మీడియాతో మాట్లాడారు. పోలీసు అధికారుల సంఘం కార్యదర్శి, కదిరి సీఐ గోరంట్ల మాధవ్ కు సవాల్ విసిరారు. ఈ నెల 25 వరకు జిల్లాలోనే ఉంటా. ఎక్కడికి రావాలో, ఎక్కడ నాలుక తెగ్గోస్తావో చెప్పు అక్కడికే వస్తా. నాలుక కోయడానికి కత్తి పదును పెట్టుకుని సిద్ధంగా ఉండమంటూ రెచ్చిపోయారు. నేను పోలీసులను అవమానించేలా మాట్లాడలేదు. నిరూపిస్తే దేనికైనా సిద్ధమంటూ ఛాలెంజ్ చేశారు. దీనికి సంబంధించిన మరింత సమాచారం కింద ఉన్న వీడియోలలో ఉంది చూడండి.