గత ఎన్నికల్లో కింగ్ మేకర్ అవుతానంటూ ఉవ్వెత్తున ఎగసిన పవన్ కళ్యాణ్ జనసేన ఫలితాల తర్వాత అంతే వేగంగా కింద పడిపోయింది. కేవలం ఒకే ఒక్క సీటుతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. పోటీ చేసిన రెండు చోట్ల కూడ పవన్ ఓడిపోవాల్సి వచ్చింది. ఈ ఫలితాలతో జనసేన కథ ముగిసింది అనుకున్నారు అంతా. కానీ ఆ ఫలితాలను పవన్ చాలా లైట్ తీసుకున్నారు. ఓటమి సహజం ముందుకు వెళుతూ ఉండాలి అంటూ శ్రేణులకు ధైర్యం చెప్పారు. పవన్‌లోని ఆ ఊపు చూసి జనసేనను బలోపేతం చేసే పనిని పవన్ మొదలుపెడతారు, వచ్చే ఎన్నికల్లో తప్పకుండా సత్తా చాటుతాం అంటూ జనసైనికులు గొప్పగా చెప్పుకున్నారు. కానీ రియాలిటీ వేరుగా ఉంది. జనసేన ఓటు బ్యాంకు బలపడకపోగా మరింత క్షీణించి పోయింది.
గత ఎన్నికల్లో జనసేనకు 5.53 శాతం ఓటు బ్యాంకు నమోదు కాగా ప్రస్తుతం అది సగానికి దగ్గరగా పడిపోయింది. జాతీయ స్థాయి సామాజిక రీసెర్చ్ సంస్థ వీడీపీ అసోసియేట్స్ తాజా సర్వేలో 2020లో జనసేన ఓటు బ్యాంకు 3.56 శాతమని తేలింది. అంటే క్రితం కంటే దాదాపు 2 శాతం ఓటు బ్యాంకు పవన్ నుండి దూరమైపోయింది. బీజేపీతో జతకట్టి బలపడిపోతున్నాం అనే భ్రమలో ఉన్న జనసేన శ్రేణులకు ఈ సర్వే నిజాలు మైండ్ బ్లాక్ చేసేలా ఉన్నాయి. సరే.. మరి జనసేన నష్టపోయింది వారితో పొత్తులో ఉన్న బీజేపీ కూడ నష్టపోవాలి కదా అంటే అలా జరగలేదు. గతంలో బీజేపీకి 0.84 శాతంగా ఉన్న ఓటు బ్యాంకు ఇప్పుడు 2.2 శాతానికి పెరిగింది.
దీన్నిబట్టి ఈ యేడాదిన్నరలో పవన్ పెర్ఫార్మెన్స్ ఎంత పేలవంగా ఉందో అర్థమైపోతోంది. ఏవేవో కబుర్లు చెప్పిన ఆయన క్షేత్ర స్థాయిలో చేసింది ఏమీ లేదని తేలిపోయింది. ఇక్కడ ఇంకో ట్విస్ట్ ఏమిటంటే జనసేనకు తగ్గిన ఓటు బ్యాంకు వైసీపీకి పెద్ద మొత్తంలో బదిలీ కావడం. 2019 ఎన్నికల్లో వైసీపీ ఓటు బ్యాంకు 49.95 శాతంగా ఉండగా ఇప్పుడది 52.97 శాతానికి పెరిగిపోయింది. అంటే జనసేన ఓటర్లు వైసీపీ వైపుకు మళ్లారని రూఢీ అవుతోంది. అలాగే టీడీపీ ఓటు బ్యాంకు సైతం 1 శాతానికి దగ్గరగా పెరిగి 40.06 శాతానికి చేరుకుంది. ఇలా వైసీపీ, టీడీపీ, బీజేపీలు గతం కంటే ఎంతో కొంత ఓటు బ్యాంకును వృద్ది చేసుకోగా జనసేన మాత్రం మరింత క్షీణించిపోయింది.