కర్నూలు జిల్లా నందికొట్కూరు వైసీపీ ఎమ్మెల్యే యక్కలదేవి ఐజయ్యకు ఈసారి పార్టీ టికెట్ ఇవ్వడంపై వైసీపీ అధినేత జగన్ డైలమాలో ఉన్నట్టు తెలుస్తోంది. ఆయనపై జగన్ కి మంచి అభిప్రాయం లేకపోవడమే ఇందుకు మెయిన్ రీజన్ అన్నట్టు వైసీపీ వర్గాల్లో టాక్. 2014 లో చివరి నిమిషంలో టికెట్ చేజిక్కించుకున్నారు ఐజయ్య. ప్రత్యర్థిపై 22 వేల భారీ మెజారిటీతో గెలుపొందారు.
ఎన్నికల్లో నెగ్గినప్పటికీ తర్వాతి కాలంలో ప్రజల్లో ఇమేజ్ పెంచుకోవడంలోనూ, అధ్యక్షుడి వద్ద నమ్మకం పెంచుకోవడంలోనూ విఫలమయ్యారని కర్నూలు జిల్లాలో చర్చలు నడుస్తున్నాయి. గత ఎన్నికల్లో వైసీపీ నుండి గెలుపొందిన ఎమ్మెల్యేలలో 23 మంది అధికార పార్టీ తీర్ధం పుచ్చుకున్నారు. ఆ సమయంలో ఐజయ్య కూడా పార్టీ మారె అవకాశాలు ఉన్నాయంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వినిపించాయి.
వైసీపీ పెద్దలు ఆయనకు నచ్చజెప్పడంతో పార్టీ మారే ఆలోచనను విరమించుకున్నారు ఐజయ్య. టిడిపి నుండి వచ్చిన ఆఫర్లకు ఐజయ్య పార్టీ మారడానికి ఆసక్తి చూపడం, నియోజకవర్గ ప్రజల్లో ఆయన మీద వ్యతిరేకత కారణంగా జగన్ ఐజయ్య స్థానంలో మరొక నాయకుడిని నిలబెట్టేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు విశ్వసనీయ సమాచారం. కాగా కర్నూలులో ఒకసారి సీఎం చంద్రబాబు నాయుడు సభ జరిగినప్పుడు వేదికపైనే ఆయనను గట్టిగ నిలదీశారు ఐజయ్య. అప్పట్లో ఈ విషయం అందరినీ ఆకట్టుకుంది.
కానీ పార్టీ కార్యకర్తలతోను, పని కోసం ఐజయ్యను ఆశ్రయించిన ప్రజల పట్ల ఆయన వ్యవహరిస్తున్న దురుసుతనం జగన్ దృష్టికి కూడా వెళ్లినట్టు తెలిసింది. అలాగే నందికొట్కూరు నియోజకవర్గంలో గెలుపు ఓటములపై రెడ్డి సామాజికవర్గ ప్రభావం ఎక్కువ. ఆ సామజిక వర్గానికి చెందిన నాయకులూ కూడా ఐజయ్య వ్యవహారశైలిపై అసహనం వ్యక్తం చేసినట్టు సమాచారం.
ఆ నియోజకవర్గం వైసీపీకి కంచుకోటలాంటిది. మరి అక్కడ సరైన నాయకుడు లేకపోతె ఓటమిపాలయ్యే అవకాశం ఉన్నట్టు అధిష్టానం భావిస్తోంది. అయితే టిడిపి ప్రలోభాలకు పార్టీ మారాలని చూసినా వెనక్కి తగ్గి వైసీపీ లోనే కొనసాగిస్తున్న ఐజయ్యను జగన్ అంత ఈజీగా మార్చాడేమోలే అని కొందరు చర్చించుకుంటున్నారు.
అయితే జగన్ ఐజయ్యను మారుస్తాడు అని బలంగా నమ్ముతున్న ఇద్దరు నేతలు ఆ టికెట్ కోసం పోటీ పడుతున్నారు. వారిలో ఒకరు ప్రస్తుతం టిడిపిలో ఉన్న మాజీ ఎమ్మెల్యే లబ్బి వెంకటస్వామి కాగా మరొకరు గతంలో ఉమ్మడి రాష్ట్ర అసెంబ్లీలో ప్రధాన భద్రతాధికారిగా పని చేసిన ఆర్ధర్. వీరిద్దరూ ఇప్పటికే సీనియర్ నేతలను సంప్రదించినట్టు సమాచారం.