ప్రస్తుతం రాష్ట్రంలో అన్ని పార్టీలూ విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఎవరి పంథాలో వారు తమ గళాన్ని వినిపిస్తూ ముందుకు వెళ్తున్నారు. ఈ పరిణామం మంచిదే అయితే.. వీరంతా కేవలం విశాఖ ఉక్కు కోసమే ఆందోళనకు సిద్ధమయ్యారా? లేక విశాఖ ఉక్కు వెనుక ఇంకేదైనా ప్రయోజనాన్ని వీరు ఆశిస్తున్నారా? అనేది కీలకంగా మా రింది. కొంత తరచి చూస్తే.. మరో ప్రయోజనం కూడా ఈ ఉద్యమాల వెనుక ఉందనే విషయం స్పష్టంగా కనిపిస్తోంది. రాష్ట్రంలో ఇప్పుడు జరుగుతున్న పంచాయతీ ఎన్నికల దరిమిలా.. మార్చిలో కార్పొరేషన్ ఎన్నికలు కూడా జరగనున్నాయి.
ఈ క్రమంలో విశాఖ కార్పొరేషన్ ఎన్నికలకు కూడా రంగం సిద్ధమవుతుంది. ఈ నేపథ్యంలో ఇక్కడి మేయర్ పీఠంపై వైసీపీ, టీడీపీలు పెద్ద ఎత్తున దృష్టి పెట్టాయి. గత సార్వత్రిక సమరంలో వైసీపీ విశాఖ నగరంలోని నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాల్లోనూ గెలుపు గుర్రం ఎక్కలేక పోయింది. ఈ నేపథ్యంలో మేయర్ పీఠాన్ని దక్కించుకుని తమ సత్తా చాటాలని నిర్ణయించుకుంది. పైగా విశాఖను రాజధానిగా ప్రకటించిన వేళ మేయర్ పీఠాన్ని దక్కించుకోకపోతే.. బ్యాడ్ సంకేతాలు వస్తాయి. దీంతో విశాఖ మేయర్ పీఠాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుని.. విశాఖ ఉక్కు ద్వారా తమ లక్ష్యం చేరుకునేందుకు వైసీపీ నాయకులు వ్యూహాత్మకంగా అడగులు వేస్తున్నారని అంటున్నారు పరిశీలకులు.
ఇక టీడీపీ విషయానికి వస్తే.. 2019 ఎన్నికల్లో రాష్ట్రంలో పరిస్థితి ఎలా ఉన్నా.. విశాఖలోని తూర్పు ఉత్తరం దక్షిణ వెస్ట్ నియోజకవర్గాల్లో టీడీపీ గంపగుత్తుగా గెలుచుకుంది. వీరిలో ఒక్కరు మాత్రమే వైసీపీ పంచన చేరినా.. మిగిలిన ముగ్గురు బలంగా టీడీపీలోనే కొనసాగుతున్నారు. ఈ నేపథ్యంలో మేయర్ పీఠాన్ని దక్కించుకునేందుకు… పైగా వైసీపీ లేవనెత్తిన మూడు రాజధానులకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న టీడీపీ దీనిని మరింత బలపరుచుకునేందుకు విశాఖ మేయర్ పీఠాన్ని దక్కించుకుని వైసీపీ దూకుడుకు చెక్ పెట్టాలని నిర్ణయించుకుంది. విశాఖ ఉక్కు ఉద్యమాల వెనుక అసలు వ్యూహం ఇదే అని కొంతమంది రాజకీయ పండితులు అంటున్నారు.