అమరావతి:ప్రస్థుతానికి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు మొత్తం అమరావతి చుట్టూ తిరుగుతున్నాయి. ఏ రాజకీయ నాయకుడు మీడియా ముందుకు వచ్చినా కూడా అమరావతి పేరును ప్రస్తావించకుండా మాట్లాడలేకపోతున్నారు.
అలాగే రాజకీయ నాయకులు అమరావతి గురించి మాట్లాడటం ఎంత సహజమో వైసీపీ ప్రభుత్వ తాను తీసుకున్న ప్రతి నిర్ణయంలో కోర్టు మెట్లు ఎక్కడం అంత సహజం. మొన్నటి వరకు వైసీపీ రంగుల విషయంలో, డాక్టర్ సుధాకర్ విషయంలో, నిమ్మగడ్డ రమేష్ విషయంలో ఇలా ప్రతీ విషయంలో ప్రభుత్వం కోర్టు ముందు నిలబడాల్సి వస్తుంది. అయితే ఇప్పుడు తాజాగా అమరావతి అంశం తెర పైకి వచ్చిన సంగతి తెలిసిందే. గత ప్రభుత్వంలో అమరావతి రాజధాని కోసం, రైతులు 33 వేల ఎకరాలు ఇచ్చారు. అయితే ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం, అమరావతిని మూడు ముక్కలు చేస్తూ, నిర్ణయం తీసుకుంది. రాజధాని వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లులు ప్రభుత్వం ఆమోదించుకుంది. అయితే ఈ రెండు బిల్లులు చెల్లవు అంటూ, రైతులు, అమరావతి పరిరక్షణ సమితి, మరి కొన్ని సంఘాలు కలిసి, హైకోర్టులో పిటీషన్ వేసి, బిల్లులను నిలుపుదల చెయ్యాలని, హైకోర్టుని కోరాయి.
దీనిపై విచారణ జరిపిన హై కోర్ట్, కౌంటర్ పిటిషన్ దాఖలు చేయడానికి ప్రభుత్వానికి 10 రోజుల గడువు ఇస్తూ, ప్రస్తుతానికి ఈ బిల్లులకు స్టేటస్ కో విధించింది. అయితే ఇప్పుడు ఈ నిర్ణయంపై ఏపీ ప్రభుత్వం సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. హైకోర్టు ఎక్స్‌పార్టీగా పేర్కొంటూ, ప్రాధమిక కారణాలు తెలియకుండా, హైకోర్టు ఆదేశాలు ఇవ్వటం, సహజ న్యాయ సూత్రాలకు వ్యతిరేకం అని ప్రభుత్వం పిటీషన్ లో తెలిపింది. అయితే హై కోర్టు ఈ బిల్లులపై కౌంటర్ దాఖలు ఫైల్ చేయడానికి సమయం ఇస్తూ స్టేటస్ కో విధించింది తప్పా, స్టే ఇవ్వలేదు. కాబట్టి పిటిషన్ పై కూడా జగన్ ప్రభుత్వానికి సుప్రీం కోర్టులో ఎదురుదెబ్బ తగలనుందని న్యాయ పండితులు చెప్తున్నారు. హై కోర్టు తీర్పులను సవాల్ చేస్తూ సుప్రీం కోర్టుకు వెళ్లడం జగన్ ప్రభుత్వానికి కొత్తేమి కాదు కానీ ఈసారి జగన్ వేసిన ఈ బ్లాస్టింగ్ ప్లాన్ తో 3 రాజధానులు బిల్లుకు మార్గం క్లియర్ అవుతుందో లేదో వేచి చూడాలి.