తెలంగాణ నూతన జోనల్ విధానానికి కేంద్రం ఆమోదం తెలిపింది. ఏడు జోన్లు, రెండు మల్టీ జోన్లకు అంగీకారం తెలుపుతూ కేంద్ర ప్రభుత్వం గెజిట్ విడుదల చేసింది. నూతన జోనల్ విధానానికి ఆమోదం తెలుపుతూ కేంద్రం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేయడంతో త్వరలోనే కొత్త జోనల్ వ్యవస్థకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ వెలువరించనుంది. కొత్త జోనల్ వ్యవస్థతో స్థానికులకే 95 శాతం ఉద్యోగాలు దక్కనున్నాయి.
తాజాగా రూపొందించిన జోనల్ వ్యవస్థలో జిల్లా, జోనల్, మల్టీ జోనల్ ఉద్యోగాల్లో 95 శాతం స్థానిక రిజర్వేషన్ కల్పించారు. 5 శాతం మాత్రం ఓపెన్ కేటగిరీ ఉంటుంది. స్థానికులు మెరిట్ సంపాదించుకొని ఓపెన్ క్యాటగిరిలో ఉద్యోగం పొందే అవకాశం ఉంటుంది. రాష్ట్ర క్యాడర్ ను రద్దు చేయడంతో ఈ 5 శాతం ఓపెన్ కేటగిరలో నూ తెలంగాణలోని 31 జిల్లాలకు చెందిన నిరుద్యోగులు మాత్రమే దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుంది. పాలనా పరమైన సంస్కరణల్లో భాగంగా చిన్న జిల్లాలను ఏర్పాటు చేసిన ప్రభుత్వం ఆయా ప్రాంతాల్లోని స్థానికులకు ఎక్కువ ప్రయోజనం కలిగేలా కొత్త జోనల్ వ్యవస్థను ఏర్పాటు చేసింది. ఒకటి నుంచి ఏడవ తరగతి వరకు వరుసగా నాలుగేళ్లు చదివితేనే స్థానికులుగా గుర్తిస్తారు. ప్రభుత్వం విడుదల చేసిన కొత్త జోన్ల వివరాలు కింద ఉన్నాయి చూడండి.

కొత్త జోన్ల వ్యవస్థలో స్థానికతపై మేధావులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఆంధ్రా ప్రాంతానికి చెందిన వారు హైదరాబాద్ లో చదువుతున్నారని, చాలా మంది సెటిలర్లు ఉన్నందున వారు ఇక్కడే చదువుకొని ఉద్యోగాలు పొందే అవకాశం ఉందని మేధావులు ఆందోళన వ్యక్తం చేశారు. తెలంగాణ వారు వారి జోను దాటి బయటకు వెళ్లలేరని ఆంధ్రా ప్రాంతంలో కూడా ఉద్యోగాలు పొందలేరన్నారు. 1 నుంచి ఏడు తరగతులు కాకుండా పాత పద్దతిలోనే స్థానికత ఉంచితే బాగుంటుందనే వారు కూడా ఉన్నారు. స్థానికత 4వ తరగతి నుంచి 10 వ తరగతి వరకు ఎక్కడ నాలుగేళ్లు చదివితే వారినే స్థానికులుగా గుర్తించిన విధంగా ఉండాలని వారు డిమాండ్ చేశారు.
కొత్త జోన్ల వ్యవస్థకు న్యాయ చిక్కులు తప్పేలా లేవని న్యాయ నిపుణులు అంటున్నారు. ఎందుకంటే కొత్త జిల్లాలకు సంబంధించి కేంద్రం గెజిట్ నోటిఫికేషన్ ఇప్పటి వరకు విడుదల చేయలేదు. కొత్త జిల్లాలకు సంబంధించి నోటిఫికేషన్ రానిదే వాటిని కూడా పరిగణలోకి తీసుకొని కేంద్రం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసిందని దీనిపై కోర్టులు అభ్యంతరం తెలిపే అవకాశం ఉందని నిరుద్యోగ జేఏసీ చైర్మన్ కోటూరి మానవతా రాయ్ అన్నారు.
గతంలో టిచర్ల నియామకాలను కొత్త జిల్లాల ప్రకారం చేపడుతామని నోటిఫికేషన్ విడుదల చేస్తే నిరుద్యోగ అభ్యర్థులు కోర్టును ఆశ్రయించడంతో పాత జిల్లాల ప్రకారమే నియమాకాలు చేపట్టాలని కోర్టు తీర్పునిచ్చింది. ప్రస్తుతం పంచాయతీ కార్యదర్శుల నియమాకాలను కొత్త జిల్లాల ప్రాతిపదికన చేపడుతామని ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. దీంతో జోన్ల వ్యవస్థ అంతా అయోమయంగా ఉందని ఎవరైనా కోర్టులను ఆశ్రయిస్తే ఖచ్చితంగా ఇది నిలిచిపోతుందని మానవతారాయ్ అన్నారు.
