కేసీఆర్, పవన్ కళ్యాణ్‌లపై బండ్ల గణేష్ కీలక వ్యాఖ్యలు

నిర్మాత నుంచి రాజకీయ తెరంగ్రేటం చేసిన బండ్ల గణేష్ ఇటీవల కాంగ్రెస్ లో చేరారు. అప్పటి నుంచి తన స్పీడ్ పెంచుతూ పలువురిని విమర్శిస్తున్నారు. కేసీఆర్ ను విమర్శించాలంటే బండ్ల గణేష్ భయపడుతున్నారని సోషల్ మీడియాలో నెటిజన్లు కామెంట్స్ చేశారు. అలాగే పవన్ భక్తుడు అయిన బండ్ల గణేష్ కాంగ్రెస్ లో చేరడం పై పలువురు విమర్శించారు. వీటన్నింటి పై ఆయన స్పందించారు.

కేసీఆర్ అంటే తనకు భయమన్న వార్తల్లో నిజం లేదని కాంగ్రెస్ నేత బండ్ల గణేశ్ అన్నారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయమన్న ఆయన కేసీఆర్ గొప్ప నేత కానీ.. పరిపాలనాదక్షుడు కాదన్నారు. తెలంగాణ కోసం 14 ఏళ్లు పోరాడిన ఆయన అనుకున్నది సాధించారని ప్రశంసించారు. అయితే, ప్రజలకు మాత్రం చేరువలో లేరని విమర్శించారు.

కేసీఆర్‌ను విమర్శించే స్థాయి తనకు లేదన్న బండ్ల గణేశ్.. ఆయనంటే భయం కాబట్టే విమర్శించడం లేదన్న వార్తల్లో నిజం లేదన్నారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయ దుందుభి మోగించడం ఖాయమని గణేశ్ ఆశాభావం వ్యక్తం చేశారు.

జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు తాను వీరాభిమానినని, అయినప్పటికీ వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్సే విజయం సాధించాలన్నారు. తాను సన్నాఫ్ నాగేశ్వరరావు అని చెప్పుకోవడం ఎంత నిజమో.. భక్త ఆఫ్ పవన్ కల్యాణ్ అని చెప్పుకోవడం కూడా అంతే కరెక్టన్నారు.

పవన్ తన బాస్ అని, ఆయన గురించి మాట్లాడే అర్హత తనకు లేదని బండ్ల గణేశ్ పేర్కొన్నారు. పవన్‌కు తాను భక్తుడినని పేర్కొన్న గణేశ్.. రాజకీయంగా మాత్రం కాంగ్రెస్ విజయం సాధించాలని కోరుకుంటున్నట్టు చెప్పారు. తాను తుది శ్వాస విడిచే వరకు కాంగ్రెస్ పార్టీలోనే ఉంటానని బండ్ల గణేశ్ స్పష్టం చేశారు.