ఏపీలో ఆ ఐదుగురు మంత్రులకు ఎమ్మెల్యే టికెట్ లేనట్టేనా

ఏపీలో ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ సీట్ల పంపకాలు ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. సీట్ల పంపకాల గురించి పార్టీలో లొల్లి జరుగుతోంది. అయితే అధికార టిడిపిలో కూడా ఈ ముసలం జరుగుతోంది. దీంతో ఏకంగా ఐదుగురు మంత్రులకు ఈ సారి అసెంబ్లీ సీటు దక్కే అవకాశం లేనట్టు తెలుస్తోంది..

మంత్రి గంటా శ్రీనివాసరావును విశాఖ ఎంపీగా పోటి చేయాలని చంద్రబాబు కోరారని తెలుస్తోంది. అయితే గంటా శ్రీనివాసరావు మాత్రం తాను ఎమ్మెల్యేగానే పోటి చేస్తానన చెప్పినట్టు సమాచారం. అయితే దీని పై పార్టీ నేతలు గంటాతో చర్చిస్తున్నారట. ఒక వేళ గంటా ఒప్పుకోనట్లయితే అనకాపల్లి అసెంబ్లీ నుంచి పోటి చేయించాలని ఇప్పటికే సీఎం ఓ నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది.

మరో మంత్రి శిద్దారాఘవరావు. శిద్దాను ఒంగోలు ఎంపీగా పోటి చేయించాలని టిడిపి భావిస్తోంది. అయితే దీనికి శిధ్దా ఒప్పుకోవడం లేదట. శిద్దా అనుచరులు మాత్రం ఎమ్మెల్యేగానే పోటి  చేయాలని ఆయన ఇంటి ముందట ధర్నా నిర్వహించారు. దీంతో తాను అధిష్టానంతో మాట్లాడి నిర్ణయం తీసుకుంటానని శిధ్దా వారికి హామీనిచ్చారని తెలుస్తోంది. మరీ శిద్దాకు అసెంబ్లీ సీటు దక్కుతుందా లేక ఎంపీగానే పోటి చేస్తారా అనేది తెలియాల్సి ఉంది.

మంత్రి ఆదినారాయణ రెడ్డిని కడప ఎంపీగా పోటి చేయించేందుకు టిడిపి ఇప్పటికే సిద్దమైంది. పార్టీ నిర్ణయం మేరకు ఆది నారాయణ రెడ్డి టిడిపి నుంచి కడప ఎంపీగా పోటి చేసేందుకు సిద్దమయ్యారని తెలుస్తోంది.  

మంత్రి కాల్వ శ్రీనివాసులుకు టికెట్ ఇవ్వవద్దని ఎమ్మెల్సీ దీపక్ రెడ్డి నిరసన తెలిపారు. అతనికి టికెట్ ఇవ్వవద్దని ఆందోళన నిర్వహించారు. అవసరమైతే తాను పోటి చేస్తానని ప్రకటించారు. దీంతో కాల్వకు టికెట్ దక్కడం పై అనుమానంగా ఉంది.

కొవ్వురూలో మంత్రి జవహర్ కు వ్యతిరేకంగా ప్రజలు తిరగబడ్డారు. మంత్రిగా ఉండి ఏం చేయలేకపోయారని విమర్శలు ఉన్నాయి. జవహర్ కు టికెట్ ఇస్తే ఓటమి ఖాయమని స్వంత పార్టీ నేతలే టిడిపి పెద్దలకు చెప్పినట్టు తెలుస్తోంది. దీంతో జవహర్ కు టికెట్ దక్కడం అనుమానంగానే ఉంది.

స్పీకర్ కోడెల శివప్రసాద్ ను  నరసరావుపేట ఎంపీగా పోటి చేయాలని చంద్రబాబు సూచించారని తెలుస్తోంది. అయితే కోడెల మాత్రం ఎమ్మెల్యేగా పోటి చేసేందుకే ఆసక్తి చూపుతున్నారని సమాచారం. దీంతో కోడెల ఒప్పుకోనట్లయితే నరసరావుపేట అసెంబ్లీ నుంచి బరిలో దింపాలని కూడా నిర్ణయించినట్టు తెలుస్తోంది. మరీ ఏపీలో ఈ ఐదుగురు మంత్రులకు, స్పీకర్ కు ఎమ్మెల్యే టికెట్ దక్కుతుందా లేక ఎంపీ టికెట్ దక్కుతుందా అనేది వేచి చూడాలి.