ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని రాష్ట్ర ప్రజలకు ప్రయోజనం చేకూరేలా ఉచితంగా ఇసుకను అందించడానికి రంగం సిద్ధం కావడం గమనార్హం. సోమవారం ఉదయం నుంచి ఉచిత ఇసుక విధానం అమలులోకి రానుంది. చంద్రబాబు ఆమోదం కోసం ఇప్పటికే ఇందుకు సంబంధించిన ఉత్తర్వుల ఫైల్ వెళ్లింది. సీఎం ఆమోదించిన వెంటనే ఉచిత ఇసుక అమలు జీవో వెలువడనుందని గనుల శాఖ చెబుతోంది.
వినియోగదారులు గనుల శాఖకు ఎలాంటి ఫీజులు చెల్లించకుండానే ఫ్రీగా ఇసుకను పొందవచ్చు. అయితే ఇసుకను మనుషులతో తవ్వి తీయించి, లారీల్లో లోడ్ చేయించి, తిరిగి డిపోలకు తరలించడానికి గనుల శాఖ కొంత మేర ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఈ మొత్తాన్ని ఆపరేషనల్ వ్యయం అని అంటారు. రీచ్‌లు, డిపోలకు మధ్య ఉండే దూరాన్ని బట్టి ఈ ఫీజులను ఒక్కో జిల్లాలో ఒక్కో విధంగా ఉంటాయి.
రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న ఇసుక రీచ్ లు బీ1 కేటగిరీ ఇసుక రీచ్ లు కాగా వీటిలో యంత్రాలను ఉపయోగించకుండానే ఇసుక తవ్వి ట్రాక్టర్ లేదా లారీల్లో లోడ్ చేయడం జరుగుతుంది. ఈ ఖర్చులతో పాటు రీచ్ నుంచి డిపోకు ఇసుకను తరలించడానికి అయ్యే రవాణా చార్జీలను కూడా వినియోగదారులే భరించాల్సి ఉంటుంది. జిల్లా కలెక్టర్లు, గనుల శాఖ అధికారులతో కూడిన జిల్లా ఇసుక కమిటీలు ఇందుకు సంబంధించిన ఫీజులను నిర్ణయిస్తాయి.
రాష్ట్ర వ్యాప్తంగా 83 బీ1 కేటగిరీ రీచ్‌ల పరిధిలో ఇసుక డిపోలు ఉండగా 8 జిల్లాల్లో ప్రతిమ ఇన్‌ఫ్రా, 8 జిల్లాల్లో జీసీకేసీ కంపెనీల నియంత్రణలో ఈ డిపోలు ఉండటం గమనార్హం. రాష్ట్రంలో మొత్తం 3 లక్షల టన్నుల ఇసుక ఉన్నట్లు ప్రాథమికంగా సమాచారం అందుతోంది. ఒక్కొక్కరికి సగటున 20 టన్నుల ఇసుక మాత్రమే సరఫరా చేయాలని విధివిధానాల్లో పొందుపరిచారు. ఇసుక అవసరం ఉన్నవారు ఆన్‌లైన్‌లోనే బుక్ చేసుకోవచ్చు.