ఏపీలో మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికలపై రాజకీయ పార్టీలు పూర్తి స్థాయిలో దృష్టి సారించాయి. 2019లో జరిగిన సార్వత్రిక ఎన్నికల తర్వాత పార్టీ గుర్తుతో జరగబోతున్న తొలి ఎన్నికలు కావడంతో ఏపీలోని ప్రధాన రాజకీయ పార్టీలన్నీ ఈ ఎన్నికలను సీరియస్‌గా తీసుకున్నాయి. ఏపీలోని కీలక మున్సిపల్ కార్పొరేషన్లలో విజయవాడ నగరపాలక సంస్థ ఒకటి. అలాంటి కీలక కార్పొరేషన్‌లో వైసీపీ గెలుపు జెండాను ఎగరేసే బాధ్యతను సీఎం జగన్ ఓ యువనేతకు అప్పగించారు.
విజయవాడలో.. మరీ ముఖ్యంగా యువతలో ఫాలోయింగ్ ఉన్న దేవినేని అవినాష్‌కు జగన్ ఆ బాధ్యతలను అప్పగించినట్లు సమాచారం. దీంతో.. గెలుపు కోసం అవినాష్ శతవిధాల ప్రయత్నిస్తున్నారు. వైసీపీ నాయకుడు కమ్మిలి సత్యనారాయణ మరణంతో డివిజన్‌లో వైసీపీ గెలుపును అధిష్టానం సీరియస్‌గా తీసుకుంది. ఇప్పటికే అవినాష్ డివిజన్ నాయకులను వ్యక్తిగతంగా కలుస్తున్నారు. డివిజన్‌లో ఇప్పటికే పలుమార్లు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న అవినాష్ కార్యకర్తల్లో జోష్ నింపే ప్రయత్నం చేస్తున్నారు. టీడీపీ మేయర్ అభ్యర్థిగా ఎంపీ కేశినేని నాని కుమార్తె శ్వేత అనధికారికంగా ప్రచారం చేస్తుండటంతో అవినాష్ ఆమె పోటీ చేస్తున్న డివిజన్‌పై ప్రత్యేకంగా దృష్టి సారించారు.
సార్వత్రిక ఎన్నికల్లో గుడివాడ నుంచి మంత్రి కొడాలి నానిపై పోటీ చేసిన అవినాష్ అక్కడి ఓటమి పాలయ్యారు. అనంతరం నెలకొన్న పరిణామాల నేపథ్యంలో ఆయన వైసీపీలో చేరారు. కొడాలి నాని కూడా అవినాష్‌ను కలుపుకునిపోయారు. అవినాష్ కూడా వైసీపీలో యాక్టివ్‌గా ఉంటూ సోషల్ మీడియా ద్వారా కూడా యువతకు మరింత దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్నారు. అన్నీ అనుకున్నట్టు జరిగి విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్‌లో వైసీపీ జెండాను అవినాష్ ఎగరేయగలిగితే సీఎం జగన్ ఈ యువనేతకు పార్టీలో తగిన గుర్తింపునిచ్చే అవకాశం ఉంది. నగరపాలక సంస్థ ఫ్లోర్ లీడర్‌గా గతంలో పనిచేసిన పుణ్యశీలకు కార్పొరేషన్లో ఫైర్‌బ్రాండ్‌గా ముద్ర ఉంది. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు ఐదుగురు వైసీపీ కార్పొరేటర్లు పార్టీ మారినప్పటికీ పుణ్యశీల మాత్రం నిబద్ధతతో వైసీపీలోనే కొనసాగారు. ఈ విధేయత వల్లనే సీఎం జగన్ పుణ్యశీలకు మేయర్ అభ్యర్థిగా అవకాశం కల్పించాలని భావిస్తున్నట్లు తెలిసింది.