ఆ ఆరుగురూ… కృష్ణాలో వారసుల తాజా పరిస్థితి ఇదే!

ఏపీలో ఎన్నికలకు సమయం దగ్గరపడుతోంది. ఎవరికి వారు వ్యూహ ప్రతివ్యూహాలు రచించుకుంటున్నారు. అయితే… ఇప్పటికే ఎన్నికల్లో పోటీ చేసిన అనుభవం, గెలిచిన అనుభవం ఉన్న సీనియర్ల సంగతి కాసేపు పక్కనపెడితే… ఇప్పుడు కృష్ణాజిల్లాలోని ఆరుగురు వారసుల అంశం హాట్ టాపిక్ గా మారింది! వీరిలో ఇప్పటికే ముగ్గురు గతంలో ఎన్నికల్లో పోటీచేసిన అనుభవం ఉన్నవారుకాగా.. మిగిలిన ముగ్గురికీ ఇదే ఫస్ట్ టైం కావడంతో.. వీరి పొలిటికల్ కెరీర్ పై ఆసక్తికరమైన చర్చ నడుస్తుంది.

అవును… ఇప్పుడు ఉమ్మడి కృష్ణాజిల్లాలో ఆరుగురు యువనేతల పొలిటికల్ కెరీర్ పై ఆసక్తికరమైన చర్చ మొదలైంది. ఇందులో భాగంగా… వచ్చే ఎన్నికల్లో గెలవక పోతే వారి పొలిటికల్ కెరీర్ పరిస్థితి ఏమిటి అనే చర్చ కూడా తెరపైకి వచ్చింది. వీరిలో ప్రధానంగా ఆరుగురు పేర్లు తెరపైకి వస్తున్నాయి. అందులో ముగ్గురు సీనియర్లు… వంగవీటి రాధ, దేవినేని అవినాష్, కాగితం కృష్ణప్రసాద్ కాగా… ఫ్రెషర్స్.. పేర్ని కిట్టు, సింహాద్రి రాం చరణ్, ఉప్పాల రాము ఉన్నారు. వీరిలో ఎవరి పరిస్థితి ఎలా ఉందనేది ఇప్పుడు చూద్దాం…!

దేవినేని అవినాష్:

బెజవాడ తూర్పు నియోజకవర్గం నుంచి వైసీపీ టిక్కెట్ పై పోటీచేయబోతున్న దేవినేని అవినాష్… గత ఎన్నికల్లో గుడివాడ నుంచి టీడీపీ టిక్కెట్ పై పోటీ చేసి కొడాలినాని చేతిలో 19,479 ఓట్లతేడాతో ఓటమిపాలయ్యారు. అనంతరం వైసీపీలో చేరిన ఆయన… ఈదఫా విజయవాడ ఈస్ట్ నుంచి బరిలోకి దిగుతున్నారు. గతంలో కాంగ్రెస్ నుంచి ఎంపీగా, టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా పోటీచేసి ఓడిపోయిన ఆయన… ఈ దఫా కచ్చితంగా గెలవాలని ఫిక్సయ్యారు.

పైగా గతకొంతకాలంగా నియోజకవర్గంలో బలంగా తిరుగుతున్న అవినాష్… కచ్చితంగా ఈదఫా గెలిచి తీరాలి. తన తండ్రి రాజకీయ వారసత్వాన్ని నిలపాల్సిన పరిస్థితి నెలకొంది. అలా కానిపక్షంలో… అవినాష్ పొలిటికల్ ఫ్యూచర్ పై నీలి నీడలు కమ్ముకునే ప్రమాదం లేకపోలేదని అంటున్నారు పరిశీలకులు.

వంగవీటి రాధ:

ఈసారి ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీచేసే అవకాశాలున్నాయని చెబుతున్న వంగవీటి రంగా… వంగవీటి రంగా వారసుడిగా ఎన్నికల్లో మాత్రం ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేదని అంటున్నారు. ఇందులో భాగంగా ఇప్పటికే నాలుగు సార్లు పోటీ చేస్తే ఒక్కసారి మాత్రమే ఆయన గెలుపొందిన విషయాన్ని గుర్తుచేస్తున్నారు. నిలకడలేమి ఇందుకు కారణం అనే కామెంట్లూ వినిపిస్తున్నాయి.

ఈసారి టీడీపీ టిక్కెట్ పై విజయవాడ సెంట్రల్ నుంచి పోటీచేసే అవకాశాలున్నాయని అంటున్నారు. అయితే ఇక్కడ నుంచి టీడీపీ సీనియర్ నేత బోండా ఉమా పోటీచేసే అవకాశం ఉందనే చర్చ నడుస్తుంది. స్థానం మారినా.. టిక్కెట్ కన్ ఫాం అని అంటున్న నేపథ్యంలో ఈ దఫా అయినా రాధా సత్తా చాటుతారా.. లేక, ప్రస్తుత పరిస్థితే కంటిన్యూ అవుతుందా అనేది వేచి చూడాలి!!

కాగిత కృష్ణప్రసాద్:

ఇదే సమయంలో మరో టీడీపీ నేత కాగిత కృష్ణప్రసాద్ కూడా రాజకీయ వారసుడిగా సత్తా చాటాల్సిన ఎన్నికలు ఇవి! పెడన నుంచి మాజీ ఎమ్మెల్యే కాగిత వెంకట్రావు వారసుడిగా బరిలోకి దిగిన కృష్ణప్రసాద్ గత ఎన్నికల్లో జోగి రమేష్ చేతిలో ఏడువేల పైచిలుకు ఓట్లతో ఓటమి పాలయ్యారు. అయితే ఈసారి ఎలాగైనా టీడీపీ నుంచి టిక్కెట్ సంపాదించుకుని పెడనలో తన రాజకీయ వారసత్వాన్ని కంటిన్యూ చేయాలని భావిస్తున్నారు. అయితే… చంద్రబాబు టిక్కెట్ ఇస్తారా లేదా అనేది వేచి చూడాలి! ఇస్తే మాత్రం గెలవడం అనివార్యం అనే భావించాలి!

పేర్ని కిట్టు:

ఈసారి మచిలీపట్నం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి వైసీపీ కీలక నేత, మాజీ మంత్రి పేర్ని నాని కుమారుడు పేర్ని కిట్టుకు ఈసారి ఎమ్మెల్యేగా పోటీచేయబోతున్నాడు! తాతకు తగ్గమనవడిగా, తండ్రికి తగ్గ తనయుడిగా ఫస్ట్ టైం పోటీ చేస్తూనే సత్తా చాటాలని ఉవ్విళ్లూరుతున్నారు. పైగా.. గత రెండేళ్లుగా నియోజకవర్గంలో క్రియాశీలకంగా పనిచేస్తూ ముందుకు వెళ్తున్నాడు. మరి కిట్టుని బందరు ప్రజలకు ఏమేరకు ఆదరిస్తారనేది వేచి చూడాలి.

ఉప్పాల రాము:

పెడన నుంచి వైసీపీ తరుపున ఈసారి ఉప్పాల రాము పోటీ చేయబోతున్నారు. పెడన నుంచి ఎమ్మెల్యేగా గెలవాలన్న తన తండ్రి కోరికను నెరవేర్చాలని.. ఫలితంగా ఈసారి జగన్ ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని భావిస్తున్నారు.

సింహాద్రి రాం చరణ్:

అవనిగడ్డ నుంచి మాజీమంత్రి సింహాద్రి సత్యనారాయణ మనవడు సింహాద్రి రాం చరణ్ కి ఈసారి అన్యూహ్యంగా టిక్కెట్ దక్కనుంది! వాస్తవానికి సత్యనారాయణ కుమారుడు డాక్టర్ చంద్రశేఖర్ కి వైసీపీ టిక్కెట్ ఇవ్వగా… వయసు రీత్యా ఆ అవకాశం రాం చరణ్ కి దక్కింది. దీంతో… ఇతనిపై కూడా పెద్ద బాధ్యతే ఉందని అంటున్నారు పరిశీలకులు.