అమరావతి నుంచి అరసవిల్లి దేవస్థానానికి రైతులు పాదయాత్ర చేపట్టిన సంగతి తెలిసిందే. పాదయాత్ర పూర్తిగా వెలుగుని కోల్పోయింది. ఇంకా ఉత్తరాంధ్రలోకి పాదయాత్ర ప్రవేశించకుండానే ఈ పరిస్థితి అంటే.. ఉత్తరాంధ్రలోకి ప్రవేశిస్తే, ఈ పాదయాత్ర గురించి అస్సలు పట్టించుకునేవారే వుండకపోవచ్చు.
విశాఖలో జనసేనాని చేసిన ‘బల ప్రదర్శన’ అమరావతి ఉద్యమానికి పెద్ద షాక్.. అన్న భావన ఇప్పుడు సర్వత్రా వ్యక్తమవుతుంది. ఆ లెక్కన, అధికార పార్టీ నెత్తిన జనసేన అధినేత పాలు పోశారని అనుకోవాల్సి వస్తుంది. పవన్ కళ్యాణ్ వ్యవహారంతో అమరావతి వ్యవహారం అటకెక్కిపోయింది.
ఎక్కడా అమరావతి గురించిన చర్చ జరగడంలేదు.
అలాగని, అమరావతి ఉద్యమం పూర్తిగా చల్లారిపోతుందని అనుకోలేం. అమరావతి రైతుల పట్ల సగటు ప్రజానీకంలో సింపతీ వుంది. ‘ఆ రైతులు భూములిచ్చింది రాష్ట్రం కోసం.. అంటే, రాష్ట్ర ప్రజల కోసం..’ అన్న భావన చాలామందిలో వుంది.. వైసీపీ నేతల్లోనూ ఈ భావన వున్నా, అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి, అమరావతి ఉద్యమంపై విమర్శలు చేస్తున్నారు. చేయాలి కూడా.!
ఇప్పటికైతే అమరావతి ఉద్యమం కాస్త చల్లబడినట్లే భావించాలి. కానీ, అధికార పార్టీ ఎలాగూ కెలుక్కుంటుంది కదా.! అధికార పార్టీ నేతలు, అమరావతి మీద మళ్ళీ అభ్యంతరకర వ్యాఖ్యలు చేస్తారు, అమరావతి ఉద్యమానికి మళ్ళీ ఆజ్యం పోస్తారు. అప్పుడు మళ్ళీ రచ్చ మామూలే.!
రాష్ట్రం నిత్యం వివాదాలతో రగులుతుంటే, కొందరు వైసీపీ నేతలు పైశాచికానందం పొందుతుంటారని పదే పదే రాజకీయ విమర్శలు వినిపించేది ఇందుకే. అమరావతి ఉద్యమమే కాదు, మూడు రాజధానుల ఉద్యమం కూడా ‘తుస్సు’మంది. ఇందులో ఇంకో మాటకు తావు లేదు