అశోక్ గజపతిరాజు వారసురాలొస్తున్నది, ఎవరామె, ఏమాకథ?

(లక్ష్మణ్ విజయ్ కొలనుపాక)

మాజీ కేంద్రమంత్రి పూసపాటి అశోక్‌గజపతిరాజు  2019 ఎన్నికల్లో పోటీ చేస్తారా లేదా? అసలు టిడిపిలో ఉంటారా లేదా అనే ప్రశ్నలు చాన్నాళ్లుగా వినపడుతున్నాయి. 2019 ఎన్నికల నాటికి ఆయన రాజకీయాలనుంచి తప్పుకుని కూతురు పూసపాటి అదితి గజపతిరాజును తన రాజకీయ వారసురాలిగా ఎన్నికల్లో నిలబెట్టవచ్చని ఇపుడు ప్రచారం జోరందుకుంది, జిల్లాలో,  జిల్లా పార్టీలో.

 మొదట జనతా పార్టీ నుంచి రాజకీయాల్లోకి వచ్చిన అశోక్ గజపతిరాజు టిడిపి ఏర్పాటయినపుడు పార్టీలో చేరారు, అప్పటినుంచి పార్టీలోనే కొనసాగుతున్నారు.  ఆయన లాయల్టీని ఎవరూ ప్రశ్నించలేరు. యువతరం రాజకీయాల్లోకి ప్రవేశిస్తున్నందున, తను ఇక ఇమడటం కష్టమని, ఈ తరం ప్రతినిధిగా ఆయన కూతరు అతిధి వచ్చే ఎన్నికల్లో పోటీ చేయించాలనుకుంటున్నారని విశ్వసనీయ సమాచారం.

 

ఈ నేపథ్యంలోనే ఆయన  పెద్ద కుమార్తె ‘అదితి గజపతి రాజు’ పేరు ప్రచారంలోకి వచ్చింది. అశోక్ గజపతిరాజుకు ఇద్దరు కూతుర్లు. పెద్దకూతురు అదితి విజయలక్ష్మి, రాజుగారి ట్రస్టు (MANSAS) వ్యవహారాలు, స్కూల్ ను చూస్తుంటారు. రెండో కూతరు విద్యావతి  మాజీ ఆంధ్రా డిజిపి  యాదవ్ కుమారుడిని పెళ్లి చేసుకున్నారు.

అతిధి ఈ మధ్య  పబ్లీక్ న కనిపిస్తూ ఉండటంతో అశోక్ గజపతి రాజు తన వారసురాలిగా ఆమెను ప్రమోట్ చేస్తున్నారని మీడియా కోడై కూసింది. కొన్ని పార్టీ కార్యక్రమాలలో కూడ ఆమెతండ్రితో  పాటు పాల్గొన్నట్లు చెబుతున్నారు. తన వారసురాలిగా  ఆమెను ప్రమోట్ చేయడం పార్టీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిదాకావెళ్లిందని, ఆయన ఈ విషయంలో అశోక్ క్లారిటీ కూడా తీసుకున్నారని అంటున్నారు.

అశోక్ గజపతి రాజు ‘మహారాజా అలక్ నారాయణ్ సొసైటీ ఫర్ ఆర్ట్స్ అండ్ సైన్స్ (మాన్సాస్ ) సంస్థను స్థాపించారు. ఆమె ఈ సంస్థ కార్యకలాపాలలో మాత్రమే పాల్గొంటున్నదని, రాజకీయ కార్యకలాపాలలో పాల్గొనడం లేదని ఆయన ముఖ్యమంత్రికి వివరణ ఇచ్చినట్లు చెబుతారు.  అయితే, ఒక తెలుగు న్యూస్ చానెల్ తో మాట్లాడుతూ అదితి భవిష్యత్తులో ఏమయినా జరగవచ్చని, భవిష్యత్తు నిర్ణయాల గురించి తానేమీ చెప్పలేనని, ఒక దేవుడే చెప్పగలడని నర్మగర్భంగా చెప్పారు. తాను రాజకీయాల్లోకి రాను,  మాన్సాస్ సేవకార్యక్రమాలను మాత్రమే చూస్తానని మాత్రం అనలేదు. అందువల్ల రాజకీయాల అప్షన్ ఉన్నట్లుగానే విజయనగరం జిల్లా టిడిపినేతలు భావిస్తున్నారు.

 

అగ్రెసివ్ రాజకీయాలు అశోక్ గజపతికి నచ్చవు. మనిషి సౌమ్యుడు. నిజాయితీ పరుడు.తనలాంటివారికి ఇక రోజులు కావని ఆయన భావిస్తున్నట్లు ఆయన గురించి తెలిసిన ఒకరిద్దరు సన్నిహితులు ‘తెలుగురాజ్యం’ కు చెప్పారు.

 

కాంగ్రెస్ కుటుంబం నుంచి వచ్చినా, తెలుగుదేశం పార్టీ ఆవిర్భావంతో ఆయన టిడిపి దారిలోకి వచ్చారు. 1978లో ఆయన జనతా పార్టీ  నుంచి అసెంబ్లీకి ఎన్నికయ్యారు. ఆపైన 1983,1985,1989,1994,1999,2009ల్లో అసెంబ్లీకి  టిడిపికి ఎన్నికయ్యారు.  ఒక్క 2004 లో మాత్రం ఆయన ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేసిన కోలగట్ట వీరభద్ర స్వామి చేతిలో 1079 వోట్లతో ఓడిపోయారు. అయితే, 2009 లో మళ్లీ చెలరేగి గెల్చారు. 2014లో ఆయన లోక్సభ ఎన్నికల్లో పోటీ చేశారు. గెలిచ్చారు. మోదీ ప్రభుత్వంలో క్యాబినెట్ మంత్రి అయ్యారు. 

తొలితరం టిడిపి నేతల్లో ఇప్పటికీ పార్టీలో క్రియాశీలంగా ఎవరైనా ఉంటే మొదట అశోక్ గజపతిరాజు పేరు మొదట చెప్పుకోవాలి. అయితే, అంతర్గత వ్యవహారాలు తెలిసిన వారు మాత్రం అశోక్ గజపతి రాజు రాజకీయ విరమణ తీసుకోవడానికి ముఖ్యమంత్రి సుముఖంగా లేరని చెబుతున్నారు. ఆయన ఈసారి కూడా పోటీ చేయాల్సిందేనని, విశ్రాంతి తీసుకునేంత పెద్ద వయసేమీ లేదని ముఖ్యమంత్రి ఆయనతో అన్నట్లు తెలిసింది.

 

అంతేకాదు, అదితి పేరు ఎందుకు ప్రచారంలోకి వచ్చిందోకూడా ముఖ్యమంత్రి వాకబు చేశారని అంటున్నారు. తాను అదితిని రాజకీయ కార్యక్రమాల్లో పాల్గొనడం లేదని, కేవలం మాన్సాస్ కార్యక్ర మాలలో మాత్రమే పాల్గొంటున్నారని అశోక్ వివరణ ఇచ్చారని అంటున్నారు.

అయితే, పార్టీలో, జిల్లాలో ఇంకా అనుమానాలు పోవడం లేదు. కెఇ కృష్ణమూర్తి, జెసి దివాకర్ రెడ్డి వంటిసీనియర్లంతా వచ్చేసారి వారసులను పోటీ చేయించేందుకు చూస్తున్నారు. ఆ సీనియర్ తరానికి చెందిన అశోక్ గజపతిరాజుకూడా ముఖ్యమంత్రిని వప్పించి  కూతురుని నిలబెట్ట వచ్చిన చాలా మంది అనుమానం. అదితికి ఎన్నికల్లో పోటీ చేసేందుకు అన్ని రకాల అర్హతలున్నాయి, చురుకైనా మహిళ అని, ఆమె రాజకీయాల్లోకి వస్తారని విజయనగరం జిల్లాలో మాత్రం ప్రజలు కన్విన్సయిపోయారు.

 

అయితే, 2014 ఎన్నికలలో ఆమె తండ్రి తరఫున బాగా ప్రచారం చేశారు.  దీనికి ఇక్కడి ఫోటోలే సాక్ష్యం.  ఆమె ప్రచారం చేసే తీరుతో ఆమె జిల్లా మొత్తం పరిచయం అయ్యారు. అశోక్ గజపతి వారసురాలు ఆమె యే అని అప్పటినుంచే ప్రచారం మొదలయింది.

(photos. Ashok Gajapatiraju Facebook timeline )