‘పూర్తిగా వైసీపీ నేతలా మారిపోతున్న సంచయిత గజపతిరాజు..’ అనే చర్చ సోషల్ మీడియాలో జరుగుతోంది. బీజేపీ నేత సంచయిత గజపతిరాజు గత కొద్ది రోజులుగా తన బాబాయ్ అశోక్ గజపతిరాజుపై ఆధిపత్యపోరు నడుపుతున్న విషయం విదితమే. రాజకీయ కురువృద్ధుడిగా ఉత్తరాంధ్ర రాజకీయాల్లో అశోక్ గజపతిరాజుకి పేరుంది. ఈ మాజీ కేంద్ర మంత్రి, రాజకీయంగా తన వెలుగుని క్రమంగా కోల్పోతూ వస్తున్నారు. వైసీపీతో సన్నిహిత సంబంధాలు, వాక్చాతుర్యం.. ఇవన్నీ ఆమెకు రాజకీయంగా ఉపయోగపడుతున్నయి. రాష్ట్ర రాజకీయాల్లో చక్రం తిప్పేయాలన్న ఆలోచన ఆమెకు వున్నట్టు కనిపించడంలేదు. కేవలం, తన బాబాయ్ అశోక్ గజపతిరాజుని రాజకీయంగా దెబ్బ కొట్టాలని మాత్రమే ఆమె ప్రయత్నిస్తున్నారు. దివంగత ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా, తమ నేతను కీర్తిస్తూ అశోక్ గజపతిరాజు ట్వీటేస్తే, ఆనాటి ఆ వెన్నుపోటు వ్యవహారాన్ని ప్రస్తావిస్తూ, సంచయిత.. బాబాయ్‌కి షాకిచ్చారు ట్విట్టర్ వేదికగా. నిజానికి, ఇది సంచయితకు సంబంధం లేని వ్యవహారం.
కేవలం, వైసీపీ మెప్పు కోసమే ఆమె ఈ ట్వీట్ వేసినట్లు అర్థమవుతోంది. పూర్తిగా బాధ్యతారాహిత్యంతో ఆమె వ్యవహరిస్తున్నారనీ, మన్సాస్ ట్రస్ట్ ఛైర్మన్ హోదాలో.. రాష్ట్రంలో దేవాలయాలపై జరుగుతున్న దాడులపై ఆమె స్పందించకపోవడమేంటని ప్రశ్నిస్తూ టీడీపీ శ్రేణులు మండిపడుతున్నాయి. మన్సాస్ బాధ్యతలు సంచయితకు జగన్ ప్రభుత్వం అప్పగించడం వెనుక పెద్ద వ్యూహమే వుందని ఇప్పుడిప్పుడే అందరికీ అర్థమవుతోంది. రాష్ట్ర స్థాయిలో పలువురు బీజేపీ నేతలు సంచయిత తీరుని తప్పు పడుతున్నప్పటికీ, ఈ విషయమై బీజేపీ అధిష్టానం ఆమెకు ఇప్పటిదాకా ఎలాంటి షాక్ ఇవ్వకపోవడం కూడా ఆశ్చర్యకరం.