వైసీపీ మంత్రుల తీరు మొదటి నుండి వివాదాస్పందంగానే ఉంది. మొదటిసారి మాత్రులమయ్యామన్న అత్యుత్సాహమో, 151 సీట్లు గెలిచాం కదా ఏం మాట్లాడినా చెల్లుతుందని అపోహా తెలియదు కానీ మీడియా ముందుకొచ్చి వివరణ ఇస్తే సరిపోయే దానికి తిట్ల దండకాలు అందుకుంటూ వార్తల్లోకెక్కుతున్నారు. అధినాయకుడి అనుగ్రహం పొందాలనే తపన, తాపత్రయం అందరికీ ఉంటుంది. కానీ ఆ తొందర్లో మాట తూలితే ఆ అధినాయకుడికే మహాహ తెచ్చినవారవుతారు. ఇప్పటికే కొడాలి నాని చంద్రబాబు నాయుడు, లోకేష్ విషయంలో స్పందిస్తున్న తీరుకు జనాలు సైతం విసుక్కుంటున్నారు. మొదట్లో ఆయన మాటలు హీరోయిజంగానే అనిపించినా పోను పోను కొడాలి ప్రెస్ మీట్ అంటే ఏముంటాయ్.. నాలుగు అన్ పార్లమెంటరీ మాటలే కదా అనుకునే స్థాయికి దిగిపోయాయి.
ఇప్పుడు ఈయన కోవలోకే చేరిపోయారు దేవాదాయశాఖ మంత్రి మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్. రామతీర్థం వివాదమలో మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత అశోక్ గజపతిరాజు మీద ఆయన రెస్పాండ్ అయిన విధానం ఎవ్వరికీ నచ్చలేదు. టీడీపీలోని నేతలంతా ఒక ఎత్తైతే అశోక్ గజపతిరాజు మరొక ఎత్తు. టీడీపీలోనే కాదు రాష్ట్ర రాజకీయాల్లోనే ఆయన ప్రత్యేకం. సుదీర్ఘ రాజకీయ జీవితంలో మచ్చలేకుండా నడుచుకున్న నాయకుడు ఆయన. పూసపాటి రాజుల వంశానికి చెందిన ఆయన అప్పుడూ ఇప్పుడూ హుందా రాజకీయాలనే చేశారు. అరుదుగా మీడియా ముందుకొచ్చే ఆయన ఏనాడూ ప్రత్యర్థి పార్టీలు, నాయకుల గురించి మాట తూలింది లేదు. ఎక్కడా అవినీతి సొమ్ముకు ఆశపడింది లేదు.
వేలాది ఎకరాలను దేవాలయాలకు దారాదత్తం చేసిన రాజుల వంశం ఆయనది. కోట్లాది రూపాయలను సేవా కార్యక్రమాలకు ఖర్చు చేసిన చరిత్ర ఉంది వారికి. అలాంటి వ్యక్తినా వెల్లంపల్లి వెధవ అంటూ సంభోధించింది అని ముక్కున వేలేసుకుంటున్నారు విన్నవారంతా. రాష్ట్రంలోని క్షత్రియ సామాజికవర్గం అశోక్ గజపతిరాజును ఒక ఐకాన్ మాదిరి భావిస్తుంటారు. క్షత్రియ వర్గం మీద ఆయన ప్రభావం చాలానే ఉంటుంది. ఇతర పార్టీల్లోని క్షత్రియ వర్గం నేతలు, ఇతర నేతలు కూడా అశోక్ గజరపతిరాజు మీద విమర్శ చేయాలంటే వెనక ముందు చూసుకుంటారు. విమర్శ చేసినా అది మర్యాదపూర్వకంగానే ఉండేలా జాగ్రత్తపడతారు. ఎందుకంటే వారికి అశోక్ గజపతిరాజు వ్యక్తిత్వం ఏంటో తెలుసు కాబట్టి.
కానీ వెలంపల్లి మాత్రం రాముడి విగ్రహం తల విరగ్గొట్టిన అలాంటి వెధవని చైర్మన్ పదవిలో ఉంచాలా అంటూ చాలా ఈజీగానే అనేశారు. ఆయన తీరు బయటి పార్టీల వారికే కాదు వైసీపీలో క్షత్రియ వర్గానికి కూడ నచ్చట్లేదు. ఇక రాష్ట్రంలో ఉన్న క్షత్రియ సంఘాలు తీవ్రస్థాయిలో మండిపడుతున్నాయి. అశోక్ గజపతిరాజుకు వెల్లంపల్లి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నాయి. ఇప్పటికే ఎంపీ రఘురామకృష్ణరాజు విషయంలో వైసీపీ నేతలు తీరుతో కొంత అసహనంగా ఉన్న క్షత్రియ వర్గం ఈరోజు అశోక్ గజపతిరాజుకు జరిగిన అవమానానికి మరింతగా రగిలిపోతోంది. మొత్తానికి మంత్రిగారి నోటి దూకుడు క్షత్రియ వర్గంలో పార్టీ పరువును ఆపదలోకి నెట్టేసింది.