రాష్ట్రంలో గత కొంతకాలంగా మాన్సస్ ట్రస్ట్ పలు వివాదాలకు కేంద్ర బిందువుగా మారింది. తాజాగా ఉద్యోగుల జీతాల వివాదం పెను దుమారం రేపుతోంది. జీతాల విషయంలో నిరసనకు దిగిన ఉద్యోగులు, అశోక్ గజపతిరాజుపై పోలీసులు కేసు నమోదు చేశారు. తాజాగా దీనిపై ట్రస్ట్ ఛైర్మన్ అశోక్ గజపతి రాజు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. మాన్సస్ ట్రస్ట్ ఈవో తనకు సహకరించడం లేదంటూ ఆయన పిటిషన్‌లో తెలిపారు. ఉద్యోగులకు జీతాలు కూడా ఇవ్వడం లేదంటూ పిటిషన్‌లో పేర్కొన్నారు. దీనిపై హైకోర్టు సోమవారం విచారణ జరిపే అవకాశం వుంది.
అంతకముందు మాన్సస్ ట్రస్ట్ ఈవో వెంకటేశ్వరరావు తమ వేతనాలు నిలిపివేసి ఇబ్బందులకు గురిచేస్తున్నాడంటూ మూడు రోజులక్రితం చైర్మన్ అశోక్ గజపతిరాజు వద్ద ట్రస్ట్ ఉద్యోగులు తమ ఆవేదనను వెల్లబోసుకున్నారు. గత 19 నెలలుగా జీతాలు ఇవ్వడం లేదంటూ నిరసనకు దిగారు. దీంతో అశోక్ గజపతిరాజుతో పాటు ఉద్యోగులపైనా విజయనగరం పోలీసులు కేసు నమోదు చేయటం జరిగింది. కష్టం వచ్చిందని చెప్పుకునేందుకు వెళ్లిన తమపైన పోలీసులు అన్యాయంగా కేసు బనాయించడం దారుణమని ఉద్యోగులు అంటున్నారు. చైర్మన్ అశోక్ గజపతిరాజు పైన కేసు పెట్టడంపై ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.