టీడీపీ నేత అశోక్ గజపతిరాజు సోమవారం మీడియాతో మాట్లాడారు. పలు అంశాలపై ఆయన ముచ్చటించారు. ఈ సందర్భంగా ఆయన తన మనసులోని కోరికను బయట పెట్టారు. నాకు ఎంపీగా పోటీ చేయాలనీ ఉంది అయితే ఎమ్మెల్యేగా పోటీ చేస్తానా , ఎంపీగా పోటీ చేస్తానా అనేది పార్టీ నిర్ణయిస్తుంది అన్నారు. గజపతిరాజు కూతురు ఎన్నికల్లో పోటీ చేసే విషయంపై ఆయన స్పందించారు. ఈ విషయం ఆయన ఏమీ చెప్పలేను అన్నారు.
ఈ సందర్భంగా బాబ్లీ కేసులో చంద్రబాబుకు నోటీసులు రావడంపై ఆయన ఇలా అన్నారు. ఉత్తర తెలంగాణ శ్రేయస్సు కోసం టీడీపీ చారిత్రక పోరాటం చేసిందన్నారు. బాబ్లీపై పోరాటం, పోలీసులు ఆనాడు టీడీపీ నేతలతో వ్యవహరించిన తీరును గుర్తుకు తెచ్చారు. టీడీపీ నాయకుల పట్ల ధర్మాబాద్ లో పోలీసులు కఠినంగా వ్యవహరించారని తెలిపారు.
కాగా ప్రతిపక్ష నేత, వైసీపీ అధినేత జగన్ పై ఆయన పలు విమర్శలు చేశారు. జగన్ తన తండ్రి రాజ్యం తీసుకొస్తాను అని చెబుతున్నాడు. అటువంటి దారుణమైన పాలన ఎవరికీ అవసరం లేదన్నారు. జంజావతి మీద వైఎస్సార్ నిర్మించిన రబ్బర్ డ్యామ్ ఎలా కొట్టుకుపోయిందో జగన్ తెలుసుకోవాలని అన్నారు. జాతీయ పార్టీలు ప్రజలకు దూరం అవుతున్నాయని ఆయన పేర్కొన్నారు. బీజేపీ ప్రభుత్వం ప్రజలు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయిందన్నారు. ప్రజలకు న్యాయం చేయడంలో బీజేపీ విఫలమైందని అశోక్ గజపతిరాజు మండిపడ్డారు.