విజయనగరం మున్సిపాలిటిలో ఆధిపత్య పోరు

విజయనగర మున్పిపాల్టిలో ఎమ్మెల్యే, చైర్మన్ ల మధ్య విబేధాలు తారా స్థాయికి చేరాయి. మున్పిపాల్టిపై ఆధిపత్యం నాదంటే నాదే అనే విధంగా వారి మధ్య వార్ నడుస్తుంది. ఒకరికొకరు సమాచారం ఇచ్చుకోకుండానే అధికారులతో సమీక్షలు నిర్వహిస్తున్నారు. దీంతో ఎవరూ చెప్పినట్టు వినాలో తెలియక అధికారులు సతమతమవుతున్నారు. మరోవైపు మున్సిపల్ చైర్మన్ రామకృష్ణ పై అవిశ్వాసం పెట్టే యోచనలో భాగంగానే ఎమ్మెల్యే మున్పిపల్ పై పట్టు సాధిస్తున్నారన్న వాదనలు వినిసిస్తున్నాయి.

విజయనగరం నియోజకవర్గ ఎమ్మెల్యే మీసాల గీత, మున్సిపల్ చైర్మన్ ప్రసాదుల రామకృష్ణ ల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా విబేధాలు ఉన్నాయి. మున్పిపల్ చైర్మన్ రామకృష్ణ మున్సిపాలిటి అభివృద్ది సమీక్షపై సమావేశం నిర్వహించిన మర్నాడే ఎమ్మెల్యే గీత సమీక్ష నిర్వహిస్తున్నారు. దీంతో అధికారులు ఎమ్మెల్యే చెప్పినట్టు వినాలా లేకా మున్సిపల్ చైర్మన్ చెప్పినట్టు వినాలా తెలియక అధికారులు మదనపడుతున్నారు.

ఎమ్మెల్యే, మున్సిపల్ చైర్మన్ల వైఖరి పట్టణాభివృద్దికి శాపమైంది. నిఃధులున్నా ఖర్చు చేయకపోవటంతో పట్టణంలో అభివృద్ది కుంటుపడిపోతుంది. ఆర్థిక సంఘం కింద వచ్చిన నిధులు, ,వివిధ గ్రాంట్ల కింద వచ్చిన నిధులు ఖర్చుకాక అలాగే ఉన్నాయి . నీటి సరఫరా విభాగానికి ఖర్చు చేయాల్సిన నిధులు కూడా ఖర్చు చేయకపోవడంతో నీటి సరఫరా అస్తవ్యస్తంగా తయారైంది. వీధి దీపాలు లేక రాత్రల్లో పట్టణమంతా చీకటిమయంగా మారుతుంది. అధికార పార్టీ ఎమ్మెల్యే, చైర్మన్ల మధ్యే విబేధాలు ఉండటంతో అధికారులు కూడా ఏమీ చేయలేక పోతున్నారు.

అయితే మున్సిపల్ చైర్మన్ తాను చెప్పినట్టు వినడం లేదని ఎమ్మెల్యే గీత భావిస్తున్నట్టు తెలుస్తోంది. దీంతో చైర్మన్ పై అవిశ్వాసం పెట్టి ఆ తర్వాత తనకు అనుకూలంగా ఉండే నాయకున్ని చైర్మన్ ను చేయాలని ఆమె భావిస్తున్నారని చైర్మన్ వర్గీయులు ఆరోపిస్తున్నారు. అందులో భాగంగానే నిత్య సమీక్షలు చేస్తూ అధికారులతో సత్సంబంధాలు కొనసాగిస్తున్నారు. అభివృద్ది నిలిచిపోవటంతో మున్సిపల్ పరిధి కావడంతో చైర్మన్ కు విమర్శలు వస్తాయని తద్వారా దానిని సాకుగా చూపి అవిశ్వాసం పెట్టించాలనే యోచనలో ఎమ్మెల్యే గీత భావిస్తున్నారని వార్తలు వస్తున్నాయి.

ఎమ్మెల్యే, చైర్మన్ ల గొడవలతో విజయనగర పట్టణాభివృద్దికి విఘాతం కలుగుతుందని పట్టణవాసులు ఆవేదన చెందుతున్నారు. ఈ నేతల తీరు మున్సిపల్ లో అవిశ్వాసానికి దారితీస్తుందా అనే చర్చ జరుగుతుంది. విజయనగర మున్సిపల్ లో అధికార పార్టీ నేతల మధ్య ఆధిపత్య పోరుపై అధినాయకుడు ఏ విధంగా స్పందించనున్నారో అని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.