నెల్లూరు కాంగ్రెస్ పాట్లు

నెల్లూరు కాంగ్రెస్‌లో పార్టీని నడిపించగల సత్తా ఉన్న నాయకుల కోసం వేట సాగుతుంది. 2014 ఎన్నికల తర్వాత నెల్లూరు జిల్లాలో కాంగ్రెస్ ఉనికి లేకుండా పోయింది. కాంగ్రెస్ నుంచి గెలుపొంది ఉన్నత పదవులను చేపట్టిన నాయకులంతా ఇప్పుడు వేరే పార్టీలలో చేరిపోయారు. దీంతో నడిపించే నాయకుడు లేక నెల్లూరు కాంగ్రెస్ రాజకీయం సంక్షోభంలో పడింది. పార్టీ కార్యక్రమాలు నిర్వహించే నాయకుడు లేక పార్టీ నాయకుల  కోసం వేట సాగిస్తుంది. దీనికోసం ఏపీ పీసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ ఊమెన్ చాందీ రంగంలోకి దిగుతున్నారు.

నెల్లూరు జిల్లాలో పది అసెంబ్లీ నియోజక వర్గాలు, రెండు పార్లమెంట్ స్థానాలు ఉన్నాయి. వీటిలో ఏ నియోజకవర్గాలకు కూడా పూర్తి  స్థాయి నేతలు లేరు. కొన్ని నియోజక వర్గాలకు అయితే పార్టీ ఇంచార్జులే లేరు. నెల్లూరు జిల్లా కాంగ్రెస్ లో హవా సాగించిన ఆనం, నేదురుమల్లి కుటుంబాలు ఇప్పుడు వేరే పార్టీలో కొనసాగుతున్నారు. దీంతో నెల్లూరు కాంగ్రెస్ పార్టీ దిక్కులేని పడవలా తయారైంది. 2014 ఎన్నికల్లో ఏ స్థానం నుంచి కూడా కాంగ్రెస సభ్యులకు డిపాజిట్లు దక్కలేదు.

ప్రస్తుతం నెల్లూరు డీసీసీ అధ్యక్షునిగా పనబాక కృష్ణయ్య కొనసాగుతున్నారు. ఆయన భార్య పనబాక లక్ష్మీ కేంద్ర మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం వీరిద్దరే అడపాదడపా కార్యక్రమాలు నిర్వహిస్తూ నెల్లూరులో కాంగ్రెస్  జీవం పోస్తున్నారు. ప్రస్తుతం సాధారణ ఎన్నికలు సమీపిస్తుండటంతో ఏపీలో కాంగ్రెస్  పార్టీ  బలోపేతంపై అధిష్టానం దృష్టి పెట్టింది.  అందుకే కేరళ మాజీ సీఎం ఉమెన్ చాందీని ఏపీసీసీ వ్యవహారాల ఇంఛార్జ్ గా నియమించింది. పార్టీ బలోపేతంపై ఉమెన్ చాందీ ఇప్పటికే పూర్తి స్థాయి దృష్టి సారించారు.

పార్టీ బలోపేతంలో భాగంగా ఉమెన్ చాందీ రాష్ట్రవ్యాప్త సమీక్షలు నిర్వహిస్తున్నారు. అందలో భాగంగానే  ఈ నెల 12న ఆయన నెల్లూరు నగరంలో పర్యటించనున్నారు. జిల్లా కాంగ్రెస్ రాజకీయంలో గూడూరు , ఉదయగిరి మినహా అంతటా ఇబ్బందిగానే ఉంది. గూడురు, ఉదయగిరి నియోజకవర్గాల్లో క్యాడర్ కాస్త బలంగా ఉంది. మిగిలిన ఎనిమిది నియోజక వర్గాల్లో పార్టీకి నాయకులు లేరు. అయితే ఉమెన్ చాందీ తన  పర్యటనలో అన్ని నియోజక వర్గాల వారిగా సమీక్ష చేయనున్నారు. ప్రస్తుతం పార్టీలో ఉన్న కీలక నేతల ఇంటికి వెళ్లి ఆయన సమీక్ష చేయనున్నారని తెలుస్తోంది. పార్టీలో  నుంచి వెఃళ్లిపోయిన నేతలను తిరిగి వెనక్కి రప్పించేందుకు ప్రణాళికలు సిద్దం చేయనున్నట్టు కాంగ్రెస్ శ్రేణులు చెబుతున్నారు.

మరీ ఉమెన్  చాందీ వ్యూహంతోనైనా నెల్లూరు కాంగ్రెస్  లో ఊపు వస్తుందా లేదా అనేది చర్చగా మారింది. కాంగ్రెస్ పార్టీ మళ్లీ నెల్లూరులో పుంజుకొని గత వైభవాన్ని నిలబెట్టుకుంటుందో లేదో అనే చర్చ సాగుతుంది. ప్రస్తుత పరిస్థితిలో ఇప్పటి నుంచే నియోజక వర్గాల పై దృష్టి సారిస్తే పూర్తి స్థాయి కాకున్నా మూడు, నాలుగు అసెంబ్లీ స్థానాలైనా గెలుస్తామని నెల్లూరు కాంగ్రెస్ శ్రేణులు ధీమాగా ఉన్నారు.