ఏం జరుగుతుందో మాటల మాంత్రికుడే చెప్పాలి
సంక్రాంతి బరిలో తాను ఉన్నానంటున్నాడు అల్లు అర్జున్. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. అల్లు అరవింద్, ఎస్. రాధాకృష్ణ నిర్మిస్తున్న ఈ చిత్రంలో పూజా హెగ్డే కథానాయికగా నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తున్నట్లు చిత్ర బృందం చెబుతోంది. టబు, సుశాంత్, నివేతా పేతురాజ్ కీలక పాత్రలు పోషిస్తున్న ఈ సినిమాకు ఎస్. ఎస్ థమన్ సంగీతాన్ని సమకూరుస్తున్నారు.
జులాయి (2012), సన్నాఫ్ సత్యమూర్తి(2015) సినిమాల తర్వాత త్రివిక్రమ్ – అల్లు అర్జున్ కాంబినేషన్ లో రూపొందుతున్న ఈ సినిమా పై అప్పుడే ప్రేక్షకుల్లో, చిత్రసీమలో అంచనాలు చోటుచేసుకుంటున్నాయి. అయితే.. ఈ చిత్రం అందరూ అనుకుంటున్నట్టుగానే సంక్రాంతి బరిలో దూసుకొస్తుందంటారా? ఏమో.. డౌటేనంటున్నారు కొందరు పరిశ్రమ పెద్దలు. ఆ డౌట్ ఎందుకు? అని ప్రశ్నిస్తే మాత్రం.. అక్కడి నుంచి వెంటనే జారుకుంటున్నారు. అదీ.. సంగతీ! ఏం జరుగుతుందో మాటల మాంత్రికుడే చెప్పాలి.. లేదా, అల్లు అర్జున్ అయినా అస్సలు విషయం బయటపెట్టాలి!