ఆక్టోపస్ 3డి మూవీ.. శంకర్ మరో అడ్వెంచర్
బడ్జెట్ సానుకూలంగా పెట్టేవాళ్లు ఉంటే హాలీవుడ్ ని కొట్టే సినిమాలు ఇండియాలోనూ తీయొచ్చని నిరూపించిన మొనగాడు శంకర్. సాంకేతికతలో నంబర్ వన్ అని ఫీలయ్యేవాళ్లను సైతం సౌత్ స్టార్ డైరెక్టర్ శంకర్ తెరకెక్కించే సినిమాలు ఆశ్చర్యపరుస్తున్నాయి. రోబో, 2.0 చిత్రాలే అందుకు పక్కా ఎగ్జాంపుల్స్. అందుకే ఆయన నుంచి ఓ సినిమా వస్తోంది అంటే ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తారు. ప్రస్తుతం ఆయన `భారతీయుడు 2` అనే మిషన్ తో ఫుల్ టైమ్ బిజీ. అయితే ఇలాంటి టైమ్ లో ఆయన వేరొక భారీ చిత్రానికి సన్నాహాలు చేస్తున్నారన్న వార్త అభిమానుల్లో కొత్త ఉత్సాహం నింపింది.
ఈసారి అతడు మరో భారీ సైన్స్ ఫిక్షన్ 3డి సినిమాకి శ్రీకారం చుట్టబోతున్నారన్నది ఆ వార్త సారాంశం. ఇప్పటికే స్క్రిప్టు కూడా రెడీ అయ్యింది. కాస్టింగ్ సెలక్షన్ జరుగుతోందట. ఈ సినిమాకి ఎంచుకున్న నేపథ్యం పూర్తిగా హాలీవుడ్ తరహా. ఈ సినిమా కథ ఆద్యంతం సముద్రంలో సాగుతుంది. సముద్ర జీవి ఆక్టోపస్ ప్రధాన పాత్రధారి. తనదైన సూపర్ పవర్స్ తో జలచరాల్ని శాసించే ఆక్టోపస్ రాజు తన సామ్రాజ్యంలో ఎదురయ్యే భీకరమైన సమస్యను పరిష్కరించేందుకు ఎలాంటి పోరాటం సాగించింది? అన్నదే కథాంశం. ఆక్వామేన్ స్ఫూర్తితో రూపొందనున్న ఈ చిత్రం పూర్తిగా యాక్షన్ అడ్వెంచర్ చిత్రమని.. వీఎఫ్ఎక్స్ కీ రోల్ పోషించనుందని తెలుస్తోంది. అంతేకాదు ఇందులో ప్రధాన పాత్ర కోసం బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ ని సంప్రదించారు. అయితే అతడికి కాల్షీట్ల సమస్య తలెత్తడంతో ఈ ప్రాజెక్టుకు ఓకే చెప్పలేదట.
దాంతో శంకర్ వెంటనే బాద్ షా షారూక్ కి కథ వినిపించి ఒప్పించారని తెలుస్తోంది. ఇదే చిత్రంలో జాకీచాన్.. దళపతి విజయ్.. చైనీస్ నటి లీ బింగ్ బింగ్ ఇతర కీలక పాత్రలు పోషించనున్నారట. ఇప్పటికే శంకర్ వీళ్లందరికీ టచ్ లో ఉన్నారు. సదరు స్టార్లు సానుకూలంగా స్పందించారట. అయితే ఇంతమందిని ఒప్పించడంలో అతడి గత ట్రాక్ రికార్డ్ ఓ కారణం. టెక్నాలజీతో వండర్స్ ని క్రియేట్ చేసే అద్భుత పనితనం శంకర్ సొంతం అని వీళ్లంతా నమ్ముతున్నారు. ముఖ్యంగా 2.0 చిత్రంలో రజనీ పాత్రతో పాటుగా పక్షిరాజుగా అక్షయ్ కుమార్ పాత్రను తీర్చిదిద్దిన తీరు గ్రాఫిక్స్ – వీఎఫ్ఎక్స్ వంటి సాంకేతికతను సమర్థంగా వినియోగించిన తీరుపైనా అందరికీ గొప్ప నమ్మకం కలిగిందట. దాదాపు 600 కోట్ల బడ్జెట్ తో 2.0 లాంటి భారీ చిత్రం తెరకెక్కించిన శంకర్ శభాష్ అనిపించారు. ఇప్పుడు బాలీవుడ్, హాలీవుడ్, సౌత్ స్టార్లను కలిపి సినిమా చేయబోతున్నారు కాబట్టి సుమారు రూ. 1000 కోట్ల బడ్జెట్ కు ఏమాత్రం తగ్గదని అంచనా వేస్తున్నారు.