కేటిఆర్ నోట లక్షా 9వేల ఉద్యోగాల మాట

తెలంగాణ స్వరాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాల కల్పన పై కేసిఆర్ కొడుకు, ఐటి శాఖ మంత్రి కేటిఆర్ స్పందించారు. తెలంగాణలో మూడు చోట్ల రాహుల్ గాంధీ జరిపిన సభలపై టిఆర్ఎస్ స్పందన తెలియజేసేందుకు కేటిఆర్ తెలంగాణ భవన్ లో ప్రెస్ మీట్ పెట్టారు. 

అంబేద్కర్ అంటే కేసిఆర్ కు చిన్నచూపు అని రాహుల్ గాంధీ తన ప్రసంగంలో చురకలు అంటించారు. దానికి కేటిఆర్ రియాక్ట్ అయ్యారు. అంబేద్కర్ కు భారత రత్న ఇవ్వకుండా మోసగించింది కాంగ్రెస్ పార్టీనే అన్నారు. 

అలాగే తెలంగాణ వచ్చిన నాలుగున్నరేళ్ల తమ ప్రభుత్వ హయాంలో లక్షా 9వేల ఉద్యోగాల భర్తీ ప్రక్రియ చేప్టటినట్లు వివరించారు. అందులో 80వేల ఉద్యోగాలకు ఇప్పటికే నోటిఫికేషన్లు జారీ అయ్యాయని అన్నారు. అందులో 32 వేల పోస్టులు భర్తీ కూడా చేశామని కేటిఆర్ వివరించారు. 

కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్ గాంధీ తెలంగాణ ప్రభుత్వం పదివేల కొలువులు కూడా భర్తీ చేయలేదని మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందన్నారు. 

తెలంగాణ వస్తే ఒక్కటే దెబ్బల లక్ష ఉద్యోగాలు ఇస్తామని, ఒక్క దెబ్బతో లక్ష కుటుంబాలు సెటిలై పోతాయని ఉద్యమ సమయంలో కేసిఆర్ ప్రకటనలు చేశారు. కానీ ఆ దిశగా తెలంగాణ సర్కారు ఏమాత్రం కసరత్తు చేయలేదన్న విమర్శలు అయితే నిరుద్యోగ యువత నుంచి వినిపిస్తూనే ఉన్నాయి.

ఈ నేపథ్యంలోనే రాహుల్ గాంధీ ఉద్యోగాల విషయంలో టిఆర్ఎస్ సర్కారును విమర్శించారని తెలుస్తోంది. దానికి కౌంటర్ గా కేటిఆర్ మాట్లాడారు. కానీ 30వేల పైచిలుకు ఉద్యోగాలనే ఈ నాలుగున్నరేళ్లలో భర్తీ చేశామని చెప్పడం కూడా నిరుద్యోగులను ఏమేరకు శాంత పరుస్తుందన్నది చూడాలి.