ఫిలిం ఇండస్ట్రీలో జరుగుతున్న కొన్ని ఆసక్తికర విషయాలను గమనిస్తుంటే ఆశ్చర్యమేస్తుంది. భలే విచిత్రంగానూ తోస్తుంది. ముఖ్యంగా కొందరు కథానాయికల కెరీర్ చూసినపుడు వింతగానూ అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ల కెరీర్ ముందు ఎలా ఉన్నా కూడా ఓ సారి ప్రేమలో పడి.. విఫలమైన తర్వాత జోరందుకుంటుంది. లేదంటే వాళ్ల పెళ్లి బ్రేక్ అయిపోయి.. భర్తతో విడిపోయిన తర్వాత వాళ్ల కెరీర్‌కు కొత్త రెక్కలొస్తున్నాయి.
నయనతార, రష్మిక మందన్న, శృతి హాసన్, అంజలి, అమలా పాల్, ఆండ్రియా లాంటి కథానాయికల కెరీర్ లే దీనికి నిదర్శనంగా చెప్పుకోవచ్చు. నయనతార ఇప్పటి వరకు మూడు సార్లు ప్రేమలో పడింది. రెండుసార్లు విఫలమైంది.. పెళ్లి వరకు వచ్చి ఆగిపోయింది. ప్రభుదేవాతో 2011లో విడిపోయింది. ఆ తర్వాత ఆమె కెరీర్ టాప్ గేర్‌లో దూసుకుపోయింది.
అలాగే రష్మిక మందన్న కన్నడ హీరో రక్షిత్ శెట్టితో నిశ్చితార్థం క్యాన్సిల్ చేసుకున్న తర్వాత స్టార్ హీరోయిన్ అయిపోయింది. శృతి హాసన్ కు కాటమరాయుడు తర్వాత తెలుగులో అవకాశాలు రాలేదు. కానీ బాయ్ ఫ్రెండ్ మైఖెల్ కోర్సెల్‌తో బ్రేకప్ తర్వాత అమ్మడుకు అవకాశాలు క్యూ కడుతున్నాయి. తెలుగులో ప్రస్తుతం క్రాక్ సినిమాలో నటిస్తుంది.
తమిళ హీరో జైతో విడిగా ఉన్నప్పటి నుంచి అంజలి కెరీర్‌కు మళ్లీ మంచి రోజులొచ్చాయి. ఏఎల్ విజయ్‌ను పెళ్లి చేసుకున్న తర్వాత అమలా పాల్ కు అవకాశాలు రాలేదు. కానీ ఆయనతో విడాకులు తీసుకున్న తర్వాత ఆమె కెరీర్ గాడినపడింది. ఇక మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్‌తో కొన్నాళ్లు ప్రేమాయణం నడిపించిన ఆండ్రియా.. ఆయనతో విడిపోయిన తర్వాత కెరీర్‌పై ఫుల్ ఫోకస్ పెట్టింది. అందుకే ఏది జరిగినా అంతా మన మంచికే అంటున్నారు ఈ భామలు. ఈ ముద్దుగుమ్మల కెరీర్ చూస్తుంటే మనకు అదే నిజమనిపిస్తుంది కదా?