సెలబ్రిటీలపై ఎఫ్ఐఆర్ .. జైలుకేనా?
50 మంది సెలబ్రిటీలపై దేశద్రోహం కేసు నమోదైంది. బీహార్‌కు చెందిన లాయర్ ఆ మేరకు దిమ్మదిరిగే స్ట్రోకిచ్చారు. దేశంలో జరుగుతున్న మూక హత్యలు, మూక స్వామ్యంపై పీఎం మోదీ పెదవి విప్పాలంటూ దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన 50 మంది సెలబ్రిటీలు పీఎం మోదీకి గత జూలైలో ఓపెన్ లెటర్ రాశారు. దీనిపై ప్రధాని మోదీ నుంచి కానీ, ప్రధాన మంత్రి కార్యాలయం నుంచి కానీ ఎలాంటి సమాధానం రాలేదు. అయితే బీహార్‌కు చెందిన అడ్వకేట్ సుధీర్ ఓజా సాయంతో ఎఫ్ఐఆర్ నమోదు చేయించడం దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. ఆగస్టు 20న పిటీషన్ వేస్తే పాట్నా ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ సెలబ్రిటీలపై ఎఫ్ ఐ ఆర్ నమోదు చేయవచ్చని తెలిపింది.
దీంతో పాట్నాలోని సర్దార్ పోలీస్టేషన్‌లో తమిళ దర్శకుడు మణిరత్నం, రామచంద్ర గుహ, అపర్ణా సేన్, బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కశ్యప్, నేషనల్ అవార్డ్ విన్నింగ్ డైరెక్టర్ శ్యామ్ బెనెగల్, నటి సుమిత్రా చటర్జీ, శుభముద్గల్‌లతో పాటు మొత్తం 50 మంది ముస్వామ్యానికి వ్యతిరేకంగా మోదీకి రాసిన బహిరంగ లేఖల్ని సాక్ష్యాలుగా చూపిస్తూ సెలబ్రిటీలపై ఎప్ఐ ఆర్ నమోదు చేయడం జరిగింది. ఇండియన్ పీనల్ కోడ్ ఆధారంగా పలు సెక్షన్‌ల కింత వీరిపై కేసు నమోదు చేయడం చర్చనీయాంశంగా మారింది.
పబ్లిక్ కి ఇబ్బందికరంగా వుండే వ్యాఖ్యలు చేయడం, ప్రాంతీయ మనోభావాల్ని కించపరచడం, అశాంతి కలిగించే ప్రకటనలు చేయడం వంటి పలు సెక్షన్‌ల కింద ఈ కేసును నమోదు చేశారు. ఇలా 50 మంది సెలబ్రిటీలపై ఎప్ఐఆర్ నమోదు కావడం దేశ చరిత్రలో ఇదే తొలి సారి కావడం గమనార్హం. ప్రధానిపై బహిరంగ లేఖలు రాసి దేశ ప్రతిష్టకు భంగం కలిగించారని 50 మంది సెలబ్రిటీలపై అభియోగం మోపడం దేశంలో పెరిగిపోతున్న నియంతృత్వానికి అద్దంపడుతోందని ప్రజాస్వామ్య వాదులు మండిపడుతున్నారు.