త్రిష‌కు గురూజీ గోల్డెన్ ఛాన్స్‌!

త్రిష‌కు భారీ ఆఫ‌రిస్తున్న స్టార్ డైరెక్ట‌ర్‌!

త‌మిళ హిట్ చిత్రం `96`తో మ‌ళ్లీ స‌క్సెస్ బాట‌ప‌ట్టింది త్రిష‌. గ‌త కొంత కాలంగా క్రేజ్ త‌గ్గుతున్న త్రిష కెరీర్‌కు ఈ సినిమా మంచి బూస్ట్‌నిచ్చింది. 96 త‌రువాత ఈ చెన్న‌య్ చంద్రంతో సినిమా చేయాల‌ని చాలా మంది పాపుల‌ర్‌ ద‌ర్శ‌కులు ఆఫ‌ర్లు ఇస్తున్నారు. క్రేజీ డైరెక్ట‌ర్‌గా పేరుతెచ్చుకున్న మణిర‌త్నం కూడా త్రిష‌కు ఓ భారీ ఆఫ‌ర్ ఇచ్చిన‌ట్లు తెలుస్తోంది. మ‌ణిర‌త్నం డ్రీమ్ ప్రాజెక్ట్ `పొన్నియ‌న్ సెల్వ‌న్‌`. బ‌డ్జెట్ కార‌ణంగా ప‌లు సార్లు వాయిదా ప‌డుతూ వ‌స్తున్న ఈ చిత్రాన్ని ఈ ద‌ఫా ఎలాగైనా తెర‌పైకి తీసుకురావాల‌ని మ‌ణిరత్నం గ‌ట్టి ప్ర‌య‌త్రాలు చేస్తున్నారు.

ఇప్ప‌టికే ఈ సినిమా కోసం అమితాబ్ బ‌చ్చ‌న్‌, విక్ర‌మ్‌, ఐశ్వ‌ర్యారాయ్‌, విజ‌య్ సేతుప‌తి, మోహ‌న్‌బాబు, కీర్తిసురేష్‌, జ‌యం ర‌వి ల‌ని కీల‌క పాత్ర‌ల కోసం ఎంపిక చేసుకున్నారు. మ‌రో కీల‌క పాత్ర కోసం త్రిష‌ని సంప్ర‌దించిన‌ట్లు త‌మిళ చిత్ర వ‌ర్గాల స‌మాచారం. గ‌తంలో మ‌ణిర‌త్నం రూపొందించిన `యువ‌` చిత్రంలో త్రిష న‌టించిన విష‌యం తెలిసిందే. చాలా కాలం త‌రువాత మ‌రోసారి త్రిష‌ని త‌న సినిమా కోసం మ‌ణిర‌త్నం ఎంపిక చేసుకోవ‌డం ప్రాధాన్య‌త‌ను సంత‌రించుకుంది. డిసెంబ‌ర్‌లో ప్రారంభం కానున్న ఈ చిత్రాన్ని లైకా ప్రొడ‌క్ష‌న్స్ అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్మించ‌డానికి ఏర్పాట్లు చేస్తోంది.