ఈ మధ్య ఏపీలో న్యాయవ్యవస్థ, శాసన వ్యవస్థ మధ్య చాలా చర్చ నడుస్తోంది. ఈ నేపథ్యంలో కొందరు వ్యక్తులు సోషల్ మీడియా ద్వారా న్యాయవ్యవస్థపై, జడ్జిలు, కోర్టు తీర్పులపై అభ్యంతరకర పోస్టులు పెట్టారు. దానిపై ఏపీ హైకోర్టు సీరియస్ అయింది. పబ్లిక్ ప్లాట్ ఫాంలో న్యాయవ్యవస్థపై అభ్యంతరకర పోస్టులు పెట్టడం ఏంటంటూ ప్రశ్నించింది. వెంటనే అలాంటి పోస్టులు పెట్టిన వారిపై కేసులు నమోదు చేయాలని ఏపీ హైకోర్టు సీబీఐని ఆదేశించింది.
దీంతో రంగంలోకి దిగిన సీబీఐ… అభ్యంతరకర పోస్టులు పెట్టిన 17 మందిపై కేసులు నమోదు చేసింది. ఫేస్ బుక్, ట్విట్టర్ లాంటి సోషల్ మీడియా నెట్ వర్క్స్ లో వీళ్లు జడ్జిలకు వ్యతిరేకంగా పోస్టులు చేసినట్టుగా గుర్తించిన సీబీఐ… ఐటీ చట్టం ప్రకారం కేసు నమోదు చేసింది.
17 మందిలో ముగ్గురు మాత్రం వేరే దేశం నుంచి పోస్టులు చేసినట్టు సీబీఐ గుర్తించింది. ఐటీ చట్టంలోని సెక్షన్ 153 ఏ, 154, 504, 505 లను ఉపయోగించి.. వాళ్లపై కేసులు నమోదు చేసి.. సీఐడీ సైబర్ క్రైం సెల్ కు ఈ కేసులను బదిలీ చేసింది సీబీఐ. దీనికి సంబంధించిన వివరాలను సీబీఐ ఎస్పీ విమలాదిత్య వెల్లడించారు. సీబీఐ డీఎస్పీ శ్రీనివాసరావు ఈ కేసును దర్యాప్తు చేయనున్నట్టు విమలాదిత్య వెల్లడించారు.