మణిరత్నంకు తప్పని మీటూ సెగ!

మణిరత్నం, ఎఆర్ రహమాన్ లకు మీటూ సెగ

మీటూ ఉద్యమం దేశంలో ప్రకంపనలు సృష్టించిన సంగతి తెలిసిందే. తనూశ్రీ దత్తా, చిన్మయి శ్రీపాద సంచలన ఆరోపణల తర్వాత ఒక్కొక్కరూ ముందుకొచ్చారు. తమపై జరిగిన లైంగికదాడుల గురించి నోరు విప్పారు. దీంతో ఈ అంశం సినిమా రంగంతో పాటు జర్నలిజం, రాజకీయ, కార్పొరేట్ రంగాన్ని కుదిపేసింది. దేశంలో హాట్ టాపిక్‌గా మారింది. ఈ నేపధ్యంలో మీటూ వివాదంలో చిక్కుకున్న వాళ్లని బహిష్కరించాలని సినిమా పరిశ్రమలో ఓ వర్గం కోరుతోంది. అయితే ఎంతమంది అమలు పరుస్తున్నారనేది ప్రక్కన పెడితే తాజాగా ఈ విషయమై మణిరత్నం విమర్శలు పాలవుతున్నారు.

ప్రముఖ తమిళ దర్శకుడు మణిరత్నంపై నెటిజన్లు మీటూ విషయమై విమర్శలు చేస్తున్నారు. తన కొత్త సినిమా విషయంలో మణిరత్నం తీసుకున్న ఓ నిర్ణయం నెటిజన్ల కోపానికి కారణం అవుతోంది.

వివరాల్లోకి వెళితే… తమిళ ప్రముఖ రచయిత వైరముత్తు తనను లైంగికంగా వేధించాడని ప్రముఖ గాయని, డబ్బింగ్ ఆర్టిస్ట్ చిన్మయి ఆరోపించిన సంగతి తెలిసిందే. ఇలా మీటూ ఆరోపణలు ఎదుర్కొన్న చాలా మంది సినీ ప్రముఖులకు అవకాశాలు తగ్గిపోయాయి. అయితే ప్రముఖ దర్శకుడిగా పేరొందిన మణిరత్నం తన కొత్త సినిమా `పొన్నియన్ సెల్వన్` కోసం వైరముత్తు చేత ఏకంగా 12 పాటలు రాయిస్తున్నారు.

దీంతో నెటిజన్లు మణిరత్నాన్ని విమర్శిస్తున్నారు. వెంటనే వైరముత్తును సినిమా నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు. మణిరత్నంతోపాటు సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్‌ను కూడా విమర్శిస్తున్నారు.మరి మణిరత్నం ఏం నిర్ణయం తీసుకుంటారో చూడాలి.

వైరముత్తు విషయానికి వస్తే…

వైర‌ముత్తు ప‌ద్మ‌భూష‌ణ్ అవార్డుతో పాటు ప‌లు జాతీయ అవార్డులు అందుకున్నాడు. ఎన్నో విజ‌య‌వంతమైన సినిమాల‌కి పాట‌లు రాసిన వైర‌ముత్తు త‌న ద‌గ్గ‌ర ప‌ని చేసే యువ‌తి పట్ల అస‌భ్యంగా ప్ర‌వ‌ర్తించాడ‌ట‌. ఆ యువ‌తి భ‌యంక‌ర‌మైన నిజాల‌ని సంధ్యా మీన‌న్ అనే జ‌ర్న‌లిస్ట్‌తో చెప్పుకోగా, ఆ వివ‌రాల‌ని సంధ్యారాణి త‌న ట్విట్ట‌ర్ ద్వారా షేర్ చేసింది. దీనిని చిన్న‌యి రీ ట్వీట్ చేసింది. వైర‌ముత్తు స‌మాజంలో మంచి వ్య‌క్తిగా గుర్తింపు తెచ్చుకుంటూ ఆ యువ‌తితో అస‌భ్యక‌రంగా ప్ర‌వ‌ర్తించేవాడ‌ట‌.

లిరిక్స్ గురించి వివ‌రించే స‌మ‌యంలో కౌగిలించుకోవ‌డం, వెకిలి చేష్ట‌లు చేయ‌డం వంటి చేసేవాడ‌ట‌. అప్పుడు ఆ యువ‌తి భ‌యంతో వ‌ణికిపోయేద‌ట‌. అత‌నితో ఒంట‌రిగా ఉండాలంటే యువ‌తికి వ‌ణుకు వ‌చ్చేద‌ని వివ‌రించింది. ఇండస్ట్రీలో అతనో ప్రిడేటర్‌లాంటి వాడు. కానీ అతనికి వ్యతిరేకంగా ఎవరూ ఏం మాట్లడలేరు. ఎందుకంటే అతనికి ఉన్న రాజకీయ సంబంధాలు అలాంటివి. బాధితుల మౌనాన్ని ఆసరాగా తీసుకుని ఆయన మరింత రెచ్చిపోయేవాడు’ అంటూ అసలు నైజాన్ని వెల్లడించారు.