అఖిల్ ఆరాటం అంతా ఇంతాకాదు!
నాగార్జున వారసుడిగా తెరపై అడుగు పెట్టిన అఖిల్ అక్కినేని హీరోగా నిలదొక్కుకునేందుకు పడుతున్న ఆరాటం అంతా ఇంతాకాదు! హీరోగా అరంగేట్రం చేసిన దగ్గర్నుంచీ అఖిల్ .. స్టార్ స్ట్రీమ్‌లోకి వచ్చేందుకు నిరంతరం తపన పడుతూనే ఉన్నాడు. కాకపోతే ఫలితాలే ఆశించినట్టుగా ఉండటం లేదు. వెండితెరపై తను అనుకున్నవేవీ జరగడం లేదు. ఇలాంటి తరుణంలో వేసే ప్రతీ అడుగు ఆచితూచి వేయక తప్పదు. ఆ దిశగానే అలోచించి అఖిల్ అడుగులు కదుపుతున్నాడు.
తాజాగా బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో గీతా ఆర్ట్స్ బ్యానర్ పై నటించే చిత్రానికి ఓకే చేశాడు. ఇంతకుముందు చేసిన ‘మిస్టర్ మజ్ను‘ సైతం సరైన ఫలితం ఇవ్వకపోవడంతో తదుపరి ప్రాజెక్టును తగు జాగ్రత్తతో ఎంచుకున్నాడన్న కథనాలు వినిపించాయి. ఎన్నో ఆశలు పెట్టుకున్న ‘మిస్టర్ మజ్ను‘ బాక్సాఫీస్ వద్ద భారీగా బోల్తా కొట్టడంతో అఖిల్ ఆ చిత్రంపై పెట్టుకున్న ఆశలన్నీ నీరుగారి పోయాయి. ఇక లాభం లేదనుకున్న అఖిల్ .. ఆ కోణంలో ఆలోచించగా బొమ్మరిల్లు భాస్కర్‌తో ప్రాజెక్టు ఓకే అయింది. అయితే, ప్రాజెక్టుకు సంబంధించి కాస్టింగ్ అంతా దాదాపు పూర్తయినా అఖిల్‌తో సరైన కెమిస్ట్రీ పండించగలిగే హీరోయిన్ మాత్రం ఇంతవరకూ తారసపడలేదు. ఈ చిత్రం కోసం ఎందరో హీరోయిన్ల పేర్లను పరిశీలించినా -చిత్రబృందం ఒక నిర్ణయానికి రాలేకపోయింది.
అయితే తాజా కథనం ప్రకారం -నాని గ్యాంగ్‌లీడర్ బ్యూటీ ప్రియాంక అరుల్ మోహన్‌ను ఎంపిక చేసుకున్నట్టు పరిశ్రమలో చెప్పుకుంటున్నారు. కథలో -బొమ్మరిల్లు భాస్కర్ మార్క్ ఫ్యామిలీ ఎమోషన్స్‌తోపాటు క్యూట్ లవ్ స్టోరీ స్పెషల్ అట్రాక్షన్‌గా ఉండటంతో ప్రియాంకను ఎంపిక చేసుకున్నట్టు సమాచారం. దాదాపుగా ఈ పేరు కన్ఫర్మ్ అయినట్టేనని, అధికారికంగా ప్రకటించడమే తరువాయని తెలుస్తోంది. గీతా ఆర్ట్స్ నిర్మిస్తోన్న చిత్రానికి దేవీ శ్రీప్రసాద్ సంగీతం సమకూరుస్తున్నాడు. ఈ చిత్రంతోనైనా అఖిల్ వెండితెరపై హీరోగా నిలదొక్కుకుంటాడని ఆశిద్దాం!