ఆర్.ఎక్స్ -100 దర్శకుడు అజయ్ భూపతి కెరీర్ డైలమా ఇప్పట్లో క్లియరవ్వదా? మహాసముద్రం ప్రాజెక్ట్ ఏడాది కాలంగా చర్చల దశలోనే నలుగుతున్న సంగతి తెలిసిందే. తొలుత ఈ ప్రాజెక్ట్ నాగచైతన్య దగ్గరకు వెళ్లడం అక్కడ తిరస్కరణకు గురికావడం తో అటుపై మాస్ రాజా రవితేజ దగ్గరకు వెళ్లింది. కానీ అనూహ్యంగా అక్కడా అజయ్ కు రిజెక్షన్ తప్పలేదు. మరి స్క్రిప్ట్ నచ్చక రిజెక్ట్ చేసారా? మరేమైనా కారణాలున్నాయా? అన్నది తేలలేదు. ఇద్దరు హీరోలు ముందుగా స్క్రిప్ట్ లాక్ చేసినట్లు బలంగా వినిపించింది. కానీ చివరిగా ఇద్దరు స్కిప్ కొట్టడంతో అజయ్ పరిస్థితి డైలమాలో పడినట్లయింది.
ప్రస్తుతం స్టార్ హీరోలతో పాటు…చిన్న స్థాయి హీరోలు కూడా వేర్వేరు సినిమాలతో బిజీగా ఉన్నారు. చేతిలో ఉన్న ప్రాజెక్ట్ లు పూర్తయినా అడ్వాన్సు కమిట్ మెంట్లు ఇప్పటికే షురూ అయ్యాయి. దీంతో అజయ్ కు ఇప్పట్లో హీరో దొరకడం కష్టమని ప్రచారం సాగుతోంది. ఇదే సమయంలో ఇద్దరు అగ్ర నిర్మాతలు అజయ్ ను వదిలేసారు. ముందుగా ఈచిత్రాన్ని నిర్మించడానికి జెమినీ కిరణ్ ముందుకొచ్చాడు. కానీ చై తప్పుకోవడం సదరు నిర్మాత సైలెంట్ అయిపోయాడు. ఈ నేపథ్యంలో సితార ఎంటర్ టైన్ మెంట్స్ ముందుకొచ్చింది. ఆ సంస్థ కూడా వెయిట్ చేసి చివరికి మా వల్ల కాదనేసింది.
తాజాగా ఈ చిత్రాన్ని నిర్మించడానికి అనీల్ సుంకర ముందుకొచ్చినట్లు ఇన్ సైడ్ టాక్ వినిపిస్తోంది. అలాగే హీరోని సెట్ చేసే బాధ్యత కూడా అనీల్ సుంకర తీసుకున్నారుట. అయితే అజయ్ కి ఇక్కడ సదరు నిర్మాత కొన్ని కండీషన్లు పెట్టాడుట. పారితోషికంలో కొంత మినహాయింపు తోపాటు..హీరోని సెట్ చేస్తున్న కారణంగా ఇంకొన్ని వెసులు బాట్లు కల్పించమన్నాడుట. అందుకు అజయ్ కూడా ఒప్పుకున్నట్లు సమాచారం. అయితే ఈ వాయిదాలు.. మార్పులు చూస్తుంటే మహా సముద్రం ఇప్పట్లో పట్టాలెక్కడం సాధ్యమేనా! అన్న సందేహం కలుగుతోంది. అసలే కరోనా కల్లోలం కలవరపెడుతోంది. ఇప్పటికే సెట్స్ లో ఉన్నవి గందరగోళంలోనే ఉన్నాయి. క్రైసిస్ క్లియరైతే కానీ ఏదీ క్లారిటీ వచ్చే పరిస్థితి లేదు మరి.