ఏదైనా ఒక్క సినిమా హిట్ అయితే చాలు అమాంతం భారీగా రెమ్యూనరేషన్లు పెంచెయ్యడం అన్నది పరిపాటిగా మారింది. అది హీరోల విషయంలో అయినా సరే హీరోయిన్లు అయినా సరే ఇది తప్పనిసరిగా జరుగుతుంది. హీరోలయితే ప్రత్యేకంగా చప్పక్కర్లేదు. దాంతో నిర్మాతలు భారీగా నష్టపోతున్నారు. ఓ పక్క కథాపరంగా భారీ బడ్జెట్లో సినిమాలను నిర్మించాలని ప్రొడ్యూసర్లు ముందుకు వెళుతూ ఉంటే అంతకు మించి భారీగా వీళ్ళ పారితోషికాలు ఉంటున్నాయి. దాంతో ఒక నిర్మాత సినిమా తీయడానికి ముందుకు రావాలంటేనే భయపడిపోతున్నాడు. ఒక సినిమా బడ్జెట్ సుమారుగా 100 కోట్లు అయితే అందులో హీరోకి ఇచ్చే రెమ్యూనరేషనే దగ్గర దగ్గర యాభై శాతం ఇవ్వవలసి ఉంటుంది. దీంతో నిర్మాత అనేవాడు భారీగా నష్టపోతున్నాడు. కొంత మంది పారితోషికాలు మార్కెట్లో వాళ్ళకు ఉండే క్రేజ్‌ని బట్టి ఉంటే… మరికొంత మందికి గత చిత్రం హిట్, ఫ్లాప్‌ల మీద ఆధారపడి ఉంటుంది. ఈ మధ్య కాలంలో కొందరు హీరోలయితే దాదాపుగా పారితోషకాలతో పని లేకుండా. ఏకంగా బిజినెస్ డీల్స్‌ను పెట్టుకుంటున్నారు. వాళ్ళ సొంత బ్యానర్లలో సినిమాను విడుదల చేసుకుని వాటి ఇతర భాషల రైట్స్‌ను సోషల్ మీడియా రైట్స్‌ను సొంతం చేసుకుంటున్నారు.
ఇలా చేయడం వల్ల ఆ సినిమా హిట్ అయితే నిర్మాతకు కాస్త డబ్బులు వస్తాయి. లేదంటే నిర్మాత నష్టపోతాడు. కేవలం థియేటర్ డబ్బులు మాత్రమే నిర్మాతకు మిగులుతాయి కాబట్టి. మరి ఈ విధమైన ఆనవాయితీని హీరోలు మార్చుకుంటే కాస్త నిర్మాత అనేవాడు సినిమాలు తీయడానికి ముందుకు వస్తాడు.
ఒకనాడు చాలీచాలనీ రెమ్యూనరేషన్‌తో ఎలాగొలా జీవితాలను నెట్టుకొచ్చారు నటీనటులు. ఆనాడు కథే హీరో.. కథ మంచిగుంటే హీరోలతో పనిలేదు.. సినిమా మొత్తం కథ చుట్టూ తిరిగేది.. అప్పుడు దర్శకులు చెప్పినట్లు వింటూ, నిర్మాతలకు సహకరించేవారు హీరోలు.. కాని ఇప్పుడు రోజులు మారాయి.. పరిస్థితులు మారాయి..
ఆనాడు టాలీవుడ్లో హీరోల డిమాండ్ కన్నా నిర్మాతలు ఇచ్చిందే పుచ్చుకునే ధోరణి ఉండేది. కాని ఇప్పుడు కథ అవసరం లేదు.. కథనం అవసరం లేదు.. అయినా రెమ్యూనరేషన్ మాత్రం కోట్లల్లో ఉంటుంది. ఇప్పుడు టాలీవుడ్లో టాప్ హీరోలనే డామినేట్ చేసే స్థాయిలో కుర్రహీరోలు రెమ్యూనరేషన్ వసూలు చేస్తున్నారంటే అతిశయోక్తి కాదు. ఇక అగ్రహీరోల విషయానికి వస్తే తమ రెమ్యూనరేషన్‌ను వచ్చే లాభాల్లో వాటాలు తీసుకుంటున్నారు.
ఇక టాప్ హీరోలు మాత్రం ఒక్కో సినిమాకు రెమ్యూనరేషన్ రూ.15 కోట్ల నుంచి రూ.20కోట్లకు పైగా తీసుకుంటున్నారట. అందులో రామ్‌చరణ్, నాగచైతన్య, ప్రభాస్, జూనీయర్ ఎన్టీఆర్, బన్నీతో పాటు కొందరున్నారు. ఇక ఇండస్ట్రీలో సొంతగా పైకొచ్చిన అర్జున్‌రెడ్డి ఫేం విజయ్ దేవరకొండ, నేచురల్ స్టార్ నానీలు మాత్రం రూ.10కోట్ల వరకు డిమాండ్ చేస్తున్నారట. ఇక శర్వానంద్, నితిన్, వరుణ్‌తేజ్, రానా వంటి హీరోలు రూ.5కోట్లకు తగ్గకుండా సొమ్ము తీసుకుంటున్నారట.