ప్రముఖ సీనియర్ నటి జయంతి తీవ్ర అస్వస్థతకు గురయైనట్లు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మంగళవారం శ్వాస సంబంధ సమస్యతో బాధపడటంతో ఊపిరి అందకపోవడంతో హుటాహుటిన బెంగుళురులోని ఓ ప్రయివేటు ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె వెంటిలేటర్ పై ఉన్నారు. దీంతో ఆమె ఆరోగ్యం విషమంగానే ఉందని డాక్టర్లు సందేహం వ్యక్తం చేసారు. 24 గంటలు గడిస్తేగానీ ఏ విషయం స్పష్టంగా చెప్పలేమని డాక్టర్లు తెలిపారు. గత 35 ఏళ్లగా జయంతి ఆస్తమాతో బాధపడుతున్నారు. ఈ నేపథ్యంలో మంగళవారం శ్వాసతీసుకోవడంలో ఒక్కసారిగా ఇబ్బందులు తలెత్తినట్లు తెలుస్తోంది.
జయంతి తెలుగు, కన్నడ, మాలాయాళ, హిందీ, మరాఠి భాషల్లో ఎన్నో సినిమాల్లో నటించారు. దాదాపు 500కు పైగా చిత్రాల్లో నటించారు. తెలుగులో హీరోయిన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చాలా సినిమాల్లో నటించారు. ఆమె వాయిస్ కు ప్రత్యేకమైన అభిమానులున్నారు. 1950 దశకం నుంచి ఆమె పరిశ్రమలో ఉన్నారు. ఇంగ్లీష్ లో బ్రౌన్ నేషన్ అనే ఓ షో కూడా చేసారు. ఇప్పటివరకూ ఎన్నో అవార్డులు..రివార్డులు సొంతం చేసుకున్నారు. కర్ణాటక ఫిల్మ్ అవార్డులు, ఉత్తమ నటి, ఉత్తమ సహాయనటి, ప్రెసిడెంట్ మెడల్, రెండు ఫిల్మ్ ఫేర్ అవార్డులను అందుకున్నారు. జయంతి 1945లో బళ్లారిలో జన్మించారు.
తెలుగులో 1961 లో భార్యాభర్తలు సినిమాతో జయంతి ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత ఎన్నో సినిమాల్లో నటించారు. చివరిసారిగా గతేడాది విడుదలైన మెగాస్టార్ చిరంజీవి నటించిన సైరా నరసింహారెడ్డిలో నటించారు. మాతృభాషలో బిజీ నటిగా కొనసాగుతూనే ఇతర భాషల్లోనూ వరుసగా సినిమాలు చేసేవారు. రేయింబశళ్లు జయంతి షూటింగ్ లతో ఎప్పుడూ బిజీగానే ఉండేవారు.