ఈ సారి సంక్రాంతికి బరిలో ఉన్న హీరోల పోటీ మాములుగా లేదు. ఓ పక్క సూపర్‌స్టార్ మరోపక్క స్టైలిష్‌స్టార్ ఇద్దరు దూకుడు అదిరిపోతుంది. ఎవరికి వాళ్ళు సంక్రాంతిని తమ ఖాతాలో వేసుకోవాలని చూస్తున్నారు. కాగా ముందుగా ఈ ఇద్దరు హీరోలు ఒకే రోజు ప్రేక్షకుల ముందుకు రావాలనుకున్నారు. కానీ నిర్మాతల మధ్య వచ్చిన చర్చతో ఒక్క రోజు గ్యాప్‌తో(సరిలేరు నీకెవ్వరు జనవరి 11న.. అల వైకుంఠపురంలో 12న ) వచ్చేందుకు సిద్ధమయ్యారు. అయితే ఒక్క రోజు గ్యాప్ ఉందిలే అన్న మాటే గానీ.. ఎలాగైనా తామే పెద్ద హిట్ కొట్టాలని ఇద్దరూ గట్టి పోటీలో దిగుతున్నారు. అంతేకాక ఈ క్రమంలో రెండు సినిమా టీంల మధ్య ఎప్పటినుంచో కోల్డ్ వార్ కూడా జరుగుతోందని సమాచారం.
ఇందులో భాగంగా మొదటిసారిగా ఓ అడుగు ముందుకేసింది అల వైకుంఠపురంలో టీం. పోస్టర్లను పక్కనపెడితే ఈ మూవీ నుంచి సామజవరగమ పాటను విడుదల చేసి అది కాస్త హిట్ అవ్వగానే అమాంతం ఆ సినిమా పై అంచనాలు పెరిగిపోయాయి. ఇక ఆ తరువాత రాములో రాముల, ఓ మై గాడ్ మై డాడీ పాటలు కూడా అందరినీ ఆకట్టుకోవడంతో ప్రేక్షకులు తమ సినిమా గురించి మాట్లాడేలా తమ వైపు తిప్పుకుంది అల వైకుంఠపురంలో టీమ్. మరోవైపు వీటిని పెద్దగా పట్టించుకోని సరిలేరు టీమ్.. నిదానంగానే తమ ప్రమోషన్లను ప్రారంభించింది. ఈ క్రమంలో ఈ మూవీ నుంచి కూడా మూడు పాటలు వచ్చాయి. కానీ సరిలేరు నీకెవ్వరు పాటలు పెద్దగా ఆకర్షించలేదు. ఇలా ఆడియో విషయంలో మాత్ర సరిలేరు టీమ్ వెనకపడ్డారనే చెప్పాలి.
ఇక ప్రమోషన్ విషయానికి వస్తే… ప్రీ రిలీజ్ వేడుకకు తేదీని ఖరారు చేయడంతో పాటు మెగాస్టార్‌ను ముఖ్య అతిథిగా ఆహ్వానించి మెగా అభిమానులకు దిమ్మతిరిగే షాక్ ఇచ్చారు ఈ టీమ్. దీంతో మెగా ఫ్యాన్స్ దృష్టి ఇప్పుడు చాలా తెలివిగా తమ వైపు తిప్పుకున్నారు. అయితే ఈ విషయంలో ఇంకా వెనకాలే ఉంది బన్నీ టీమ్. ఇదిలా ఉంటే ఇప్పుడు ప్రీ రిలీజ్ విషయంలో అల యూనిట్ కాస్త డైలమాలో ఉన్నట్లు సమాచారం. మహేష్ వేడుకకు చిరంజీవి ప్రధానాకర్షణ అవ్వనుండగా.. తమ వేడుకకు ఎవరిని పిలవాలా..? అని మూవీ యూనిట్ ఆలోచిస్తుందట( అయితే బన్నీ టీమ్ మొదట చిరునే అనుకున్నారట. కానీ ఆ లోపే మహేష్ నిర్మాత అనిల్ సుంకర మెగాస్టార్‌ను ఒప్పించుకోవడంతో వారు కాస్త ఇబ్బందిగా ఫీల్ అయినట్లు టాక్). ఈ క్రమంలో పవన్, రామ్ చరణ్, ఎన్టీఆర్ ఇలా పలువురి పేర్లను వారు పరిశీలిస్తున్నారట. ఇక పవన్, త్రివిక్రమ్ ఎలాగూ మంచి స్నేహితుడు కాబట్టి.. ఆయనను పిలిస్తే కచ్చితంగా వస్తాడని నిర్మాతలు అనుకుంటున్నారు. దీంతో ఆయనతో ప్రస్తుతం సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ ఆయన రావడం కుదరకపోతే… చెర్రీ, ఎన్టీఆర్ ఇద్దరినీ పిలిపించాలని అనుకుంటున్నారు. ఆర్ఆర్ఆర్‌లో వీరిద్దరు కలిసి నటిస్తుండగా.. ఆ ఇద్దరు తమ వేడుకకు వస్తే సినిమాకు మరింత క్రేజ్ రావొచ్చని ‘అల’ టీమ్ ప్లాన్ వేసింది. మరి మొత్తానికి అక్కడ చిరుకు గట్టి పోటీ ఇవ్వడానికి.. ఇక్కడ అల టీమ్ ఎవరినీ గెస్ట్‌గా తీసుకురానుందో తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే. మొత్తానికి ఇప్పుడు సినిమాల జయోపజయాల టెన్షన్ కన్నా ప్రీరిలీజ్‌లో వచ్చే గెస్ట్‌ల పైనే ఎక్కువ ఆకర్షణ వెళుతుంది. పెద్దసినిమాలైనా చిన్నసినిమాలైన అక్కడికి వచ్చే గెస్ట్‌లను బట్టి సినిమా హైప్ అమాంతం పెంచేస్తున్నారు. ఈ మధ్య కాలంలో చిత్ర యూనిట్లు.