టిఆర్ఎస్ గొంగిడి సునీత పై సంచలన ఆరోపణలు చేసిన తుర్కపల్లి జడ్పీటిసి (వీడియో)

ఆలేరు టిఆర్ఎస్ అభ్యర్ధి గొంగిడి సునీతా మహేందర్ రెడ్డి పై తుర్కపల్లి జడ్పీటిసి బోరెడ్డి జ్యోతి అయోధ్య రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. సునీత ఎమ్మెల్యేగా ఉండి నియోజకవర్గానికి చేసిందేం లేదన్నారు. మద్యం వ్యాపారులకు అండగా నిలిచి వేల కోట్ల రూపాయలు దండుకున్నారు కానీ ఎండిన పొలాలు, రైతుల కన్నీరు ఆమెకు కనపడలేదన్నారు.

మద్యం వ్యాపారులను తీసుకొని అసెంబ్లీ లాబీలోకి వెళితే మంత్రి పద్మారావు ఆమెను అందరి ముందే తిట్టారన్నారు. 2014 కు ముందు కిరాయి ఇంట్లో ఉన్న సునీతా నేడు హైదరాబాద్ లో నాలుగు విశాలమైన భవంతులు కట్టారని, యాదాద్రిలో, భువనగిరిలో ప్లాట్లు, వందల ఎకరాలు సంపాదించారన్నారు. అవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయో సునీతా మహేందర్ రెడ్డి తెలపాలని జ్యోతి డిమాండ్ చేశారు.  

నియోజకవర్గంలోని ప్రభుత్వ భూములను సునీత తన అనుచరులతో కబ్జా చేయించారన్నారు. తుర్కపల్లిలో 30 పడకల ఆస్పత్రి మంజూరు కాకుండా అడ్డుకున్నారన్నారు. డ్రైనేజి పనులకు 98 లక్షలు మంజూరు చేయిస్తే ఆ పనులు చేస్తే జడ్పీటిసిగా తనకు ఎక్కడ పేరు వస్తుందో అని ఆ నిధులు రాకుండా సునీత అడ్డుకున్నారని ఆమె విమర్శించారు. ఎమ్మెల్యేగా పని చేసినా కూడా కనీసం సర్పంచ్ లను, ఎంపీటిసి, జడ్పీటిసిలను గుర్తు పట్టకుండా ఆమె అవమానపరిచారని జ్యోతిరెడ్డి తెలిపారు. 

సునీతారెడ్డి నియోజకవర్గంలో అనేక అరాచకాలకు పాల్పడుతున్నారని ఆమె అన్నింటిలో కూడా లంచాలు తీసుకున్నారని ఆమె ఆరోపించారు. ఆమె భర్త మహేందర్ రెడ్డి ఈ అరాచకాలను చేయిస్తున్నారని ప్రజా ప్రతినిధులకు అసలు విలువివ్వరన్నారు. వెనుకబడిన ఆలేరు నియోజకవర్గాన్ని మరింత వెనకబాటు తనానికి తీసుకెళ్లారన్నారు.

సునీతా మహేందర్ రెడ్డి తమ  బంధువుల పేర్ల మీద వందల ఎకరాలు దోచుకున్నారని ప్రభుత్వ భూములను కూడా తమ భూములుగా మార్చుకున్నారన్నారు. మిషన్ భగీరథలో గ్రామాలకు నిధులు రాకుండా అడ్డుకున్నారన్నారు. తుర్కపల్లి దూరంగా అడవుల్లో పాఠశాలలను ఏర్పాటు చేశారన్నారు. ప్రతి చిన్న విషయంలో జోక్యం చేసుకొని ఇబ్బందులు పెట్టేవారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.  

 ద్రోహులైన నాయకుల వద్ద పని చేయలేక పార్టీకి, పదవికి రాజీనామా చేస్తున్నట్ట ఆమె తెలిపారు. ఆమెతో పాటు ఆలేరు మార్కెట్ కమిటి మాజీ వైస్ చైర్మన్ గుడిపాటి మధుసూధన్ రెడ్డి, మాజీ జడ్పీటిసి గట్టు స్వరూప నరేందర్, ముఖ్య నేతలు టిఆర్ఎస్ కు రాజీనామా చేశారు. బోరెడ్డి జ్యోతి అయోద్య రెడ్డి మాట్లాడిన వీడియో కింద ఉంది చూడండి. 

 

THURKHAPALLY ZPTC