జనగామలో ముత్తిరెడ్డి డౌన్ డౌన్ అన్నారు (వీడియో)

టిఆర్ఎస్ అధినేత కేసిఆర్ అసెంబ్లీ రద్దు చేసిన రోజే 105 మంది అభ్యర్థులను ప్రకటించి సంచలనం రేపారు. తెలంగాణ ఇద్దరు మినహా మిగిలిన సిట్టింగ్ ఎమ్మెల్యేలందరినీ అభ్యర్థులుగా ప్రకటించారు. ఈ వ్యవహారం ఇప్పుడు టిఆర్ఎస్ లో కొత్త తలనొప్పులు తెస్తున్నది. 

చెన్నూరు బరిలో పెద్దపల్లి ఎంపి బాల్క సుమన్ దిగుతాడని కేసిఆర్ ప్రకటించారు. కానీ అక్కడ అగ్గి మండుతున్నది. నల్లాల ఓదేలు అనుచరుడు గట్టయ్య ఒంటికి నిప్పంటించుకుని ఆత్మహత్య చేసుకోవడం టిఆర్ఎస్ వర్గాల్లో విషాదం నింపింది. ఆరు రోజులపాటు మృత్యువుతో పోరాడిన గట్టయ్య మంగళవారం మధ్యాహ్నం హైదరాబాద్ లోని యశోద ఆసుపత్రిలో కన్ను మూశారు.

ఇదే కాకుండా మిగతా నియోజకవర్గాల్లోనూ అభ్యర్థుల మీద తీవ్రస్థాయిలో వ్యతిరేకత వ్యక్తమవుతున్నది. తెలంగాణ వచ్చిన నాలుగున్నరేళ్ల కాలంలో నిత్యం వివాదాల్లో నిలిచిన వ్యక్తిగా జనగామ మాజీ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి నిలిచారు. అవినీతి అక్రమాల్లో ఆరితేరినట్లు ఆయన మీద ఆరోపణలున్నాయి. 

ముత్తిరెడ్డి అవినీతిపై స్వయంగా అప్పటి జనగామ జిల్లా కలెక్టర్ దేవసేన నిప్పులు చెరిగారు. ముత్తిరెడ్డి చెరువు కబ్జా చేయాలని చూస్తుంటే తాను అడ్డుకున్నానని కలెక్టర్ చెప్పడం అప్పట్లో చర్చనీయాంశమైంది. అంతేకాకుండా దందాలు చాలానే చేసినట్లు ముత్తిరెడ్డి మీద ఆరోపణలున్నాయి. అయితే అవినీతి అక్రమాలు చేసినట్లు ఆరపణలున్న ముత్తిరెడ్డికి మాత్రం ఎమ్మెల్యే టికెట్ వస్తున్నది.. అవినీతిని అడ్డుకున్న కలెక్టర్ దేవసేనకు మాత్రం జనగామ నుంచి పెద్దపల్లికి బదిలీ అయింది. అప్పట్లో ఇది పెద్ద దుమారం రేపింది కూడా.

అంతేకాకుండా స్టేషన్ గన్ పూర్ లో సిట్టింగ్ అభ్యర్థి తాటికొండ రాజయ్యకు వ్యతిరేకంగా టిఆర్ఎస్ జనాలు ఆందోళన చేస్తున్నారు. ఏకంగా వేలాది మంది ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరిని కలిసి రాజయ్య అభ్యర్థిత్వాన్ని రద్దు చేయాలని కోరారు. స్టేషన్ గన్ పూర్ కు కడియం ఎమ్మెల్యేగా పోటీ చేయాలని వారు నినదించారు. దీనిపై అధినేత కేసిఆర్ కు నివేదిస్తానని, ఆయన ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటానని కడియం హామీ ఇచ్చారు. 

ఈ నేపథ్యంలో వివాదాస్పద ఎమ్మెల్యేలు, ప్రజలకు దూరంగా ఉన్న వారు, భూకబ్జాలు చేసిన వారందరి సీట్లలో క్యాండెట్లను మార్చే చాన్స్ ఉందన్న వాతావరణం నెలకొనడంతో ఆందోళనలు తీవ్రతరమవుతున్నాయి. అధికార టిఆర్ఎస్ వాళ్లే ఎక్కువ చోట్ల ఆందోళనబాట పడుతున్నారు. కొంత మంది అభ్యర్థులను బిఫారాలు చేతికందేనాటికి మార్చే చాన్స్ ఉందన్నదానికి ఈ ఘటనలు ఉదాహరణగా చెబుతున్నారు. 

తాజాగా ముత్తిరెడ్డి అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తూ అభ్యర్థిత్వాన్ని ప్రకటించిన నాటినుంచి ఆందోళనలు జనగామలో జరుగుతున్నాయి. ముత్తిరెడ్డి డౌన్ డౌన్ అంటూ టిఆర్ఎస్ కార్యకర్తలు జనగామలో ఆందోళన చేశారు. ముత్తిరెడ్డి గో బ్యాక్ అని నినాదాలు చేశారు. అంతేకాకుండా ముత్తిరెడ్డి దిష్టిబొమ్మ ను కాలబెట్టారు.

అయితే ఆ కార్యకర్తలు ముత్తిరెడ్డి దళిత ద్రోహి అంటూ విరుచుకుపడ్డారు. రిజర్వేషన్లు అవసరం లేదన్నట్లు ముత్తిరెడ్డి మాట్లాడడాన్ని వారు గుర్తు చేశారు. అయితే ఆ కార్యకర్తలంతా ఇదే ఆందోళనా కార్యక్రమంలో కేసిఆర్ కు జిందాబాదులు కొట్టడం గమనార్హం.

ముత్తిరెడ్డి కి వ్యతిరేకంగా జనగామలో ఆయన దిష్టిబొమ్మను తగలబెడుతున్న వీడియో కింద ఉంది. వారేమంటున్నారో చూడండి.

muttireddy down down