తెలంగాణలో కారు జోరుతో దూసుకు పోతుంది. ఏ ఎన్నికలు పెట్టినా కారు హవానే సాగుతోంది. పార్లమెంటు అభ్యర్ధుల ఎంపికలో సీఎం కేసీఆర్ ఇప్పటికే బిజి అయ్యారు. స్థానిక ఎంపీలకు ఫోన్ చేసి మరీ వివరాలు తెలుసుకుంటున్నారు. సర్వే నివేదికలు కూడా పరిశీలిస్తున్నారు. వీటన్నింటి తర్వాత సిట్టింగ్ లకే అధిక ప్రాధాన్యతనివ్వాలని సీఎం కేసీఆర్ భావిస్తున్నారని తెలుస్తోంది. ముగ్గురు సిట్టింగ్ ఎంపీలను మార్చాలని ఆయన భావిస్తున్నారని చర్చ జరుగుతోంది.
ఈ ముగ్గురు ఎంపీలకు కేసీఆర్ టికెట్ నిరాకరిస్తున్నారని సమాచారం. అందులో ముందుగా ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఉన్నారు. నల్లగొండ ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి , మహబూబ్ నగర్ ఎంపీ జితేందర్ రెడ్డి కూడా ఉన్నారు. మరో వైపు పెద్దపల్లి మాజీ ఎంపీ వివేక్ కు కూడా టికెట్ ఇచ్చేందుకు నిరాకరిస్తున్నారని చర్చ జరుగుతోంది.
పొంగులేటి మరియు వివేక్ లు అసమ్మతిని పెంచి పార్టీ ఓడిపోయేలా చేశారన్న విమర్శలు ఉన్నాయి. గ్రూపు రాజకీయాలను వీరు ప్రోత్సాహించారని కేసీఆర్ నోటిసులో ఉంది. అందుకే వీరికి టికెట్లివ్వవద్దని నిర్ణయించారట. మరో వైపు ఎంపీ జితేందర్ రెడ్డి పార్లమెంటుపక్ష నేతగా తన బాధ్యత నిర్వర్తించలేదని మరియు ప్రజలకు దూరంగా ఉన్నారన్న విమర్శలున్నాయి.
అందుకే వీరికి టికెటివ్వవద్దని నిర్ణయించారని తెలుస్తోంది. సిట్టింగ్ ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డికి కూడా ఈ సారి ఎంపీ టికెట్ దక్కే అవకాశం లేదు. సుఖేందర్ రెడ్డికి ఎమ్మెల్సీ సీటు ఇచ్చి మంత్రిని చేస్తారని ప్రచారం జరుగుతోంది. నల్లగొండ నుంచి పారిశ్రామిక వేత్తకు ఎంపీ టికెట్ దక్కే అవకాశం ఉంది. సుఖేందర్ రెడ్డి గతంలో కాంగ్రెస్ నుంచి గెలుపొందారు. ముగ్గురు సిట్టింగ్ లకు ఈ సారి టికెట్ దక్కదనే చర్చ జోరుగా సాగుతోంది.