నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ నియోజకవర్గం నుంచి టిఆర్ఎస్ అభ్యర్ధిగా పోటి చేస్తున్న జూపల్లి కృష్ణారావుకు హైదరాబాద్ నడిబొడ్డున చేదు అనుభవం ఎదురైంది. కొల్లాపూర్ నియోజకవర్గంలో ప్రచారం చేస్తున్న సమయంలో కూడా పలు గ్రామాలల్లో జూపల్లి కృష్ణారావును ప్రజలు అడ్డుకొని నిలదీశారు. మంత్రిగా ఉండి ఏం చేశారో చెప్పాలని వారు ప్రశ్నించారు. వారి ఆందోళనతో సమాధానం చెప్పలేక జూపల్లి అక్కడి నుంచి బయటపడ్డారు.
తాజాగా హైదరాబాద్ లోని గౌలిపురాలో జూపల్లిని అడ్డుకొని ప్రజలు నిలదీశారు. కొల్లాపూర్ నియోజకవర్గానికి చెందిన ప్రజలు హైదరాబాద్ లోని వివిధ ప్రాంతాలలో నివసిస్తున్నారు. ఉపాధి లేక వారు పట్నం బాట పట్టి ఇక్కడ ఉంటున్నారు. దీంతో హైదరాబాద్ లో వివిధ ప్రాంతాలలో నివసిస్తున్న కొల్హాపూర్ నియోజకవర్గ ప్రజలతో జూపల్లి కృష్ణారావు గౌలిపురాలో సమావేశం నిర్వహించారు.
అక్కడికి భారీ ఎత్తునే కొల్హాపూర్ ప్రజలు చేరుకున్నారు. అక్కడ వారితో జూపల్లి మాట్లాడుతుండగా వారు వాగ్వాదానికి దిగారు. జూపల్లిని నిలదీశారు. ఏం చేశావని మళ్లీ ఓట్లు అడుగుతున్నావు. 20 ఏళ్లు మిమ్ముల గెలిపిస్తే మీరు ఏం చేశారని వారు నిలదీశారు. మీరే కనుక మంచి చేస్తే తాము ఈ రోజు హైదరాబాద్ ల ఉండకపోయేవారమని వారన్నారు.
ఎట్టి పరిస్థితిలో కూడా ఓటు వేయమని జూపల్లి ముఖం మీదే వారు చెప్పారు. అయినా కూడా జూపల్లి ప్రసంగిస్తూ కాంగ్రెస్ వారిని విమర్శించారు. దీంతో అక్కడున్న వారు నీకు ఓటేసే ప్రసక్తే లేదు.. ఇక్కడి నుంచి వెళ్లిపోవాలంటూ ఆందోళన చేశారు. దీంతో చేసేదేమి లేక జూపల్లి అక్కడి నుంచి వెళ్లిపోయారు. జూపల్లిని ఘోరావ్ చేసిన వీడియో కింద ఉంది చూడండి.