(లక్ష్మణ్ విజయ్ కొలనుపాక)
గజ్వెల్ నుంచి రెండో సారి పోటీ చేస్తున్న ముఖ్యమంత్రి కె చంద్రశే ఖర్ రావు నామినేషన్ వేసేందుకు కట్టుదిట్టమయిన ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఆయన ఏ రోజు నామినేషన్ వేస్తాడనేది ఇంకా బయటపెట్టలేదు. అయితే, ఆయన లకీనెంబర్ ఆరు కాబట్టి , ఈ నెంబర్ సమీపాన ఉన్న మంచిరోజు తన 15న తేదీ. అందువల్ల ఆయన 15 వ తేదీన నామినేషన్ వేస్తారని అంటున్నారు.
ఈ ఎన్నికలకు చాలా ప్రాముఖ్యం ఉంది. గతంలో ఆయన పోటీ చేసిన నాటికి ఆయన ఉద్యమ కారుడు. తెలంగాణ రాష్ట్రసమితి ఏర్పాటుచేసి ప్రజలను తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం సమీకరించిన ఢిల్లీని గడగడ లాగించిన ఉద్యమనేత. ఒక విధంగా ఆయన తెలంగాణ జాతిపిత. ఆయన తిరుగు లేని నేత. ఆయన మాటకు తిరుగుండేది కాదు.
అయితే, 2014 తర్వాత సీన్ మారిపోతూ వస్తున్నది. ప్రభుత్వం ఏర్పాటు చేశాక వచ్చే విమర్శలు, ఆరోపణలు అన్నీ ఆయనకుఅంటుకున్నాయి. అవినీతి, కమిషన్ల వంటి తీవ్రమయిన ఆరోపణలు వచ్చాయి. కెసియార్ కుటుంబ పాలన సాగుతున్నది కాంగ్రెస్ నుంచి అమిత్ షా దాకా విమర్శులు కుప్పిస్తున్నారు. ఇదొక ఎత్తుఅయితే, పార్టీలో ఆయన మాట ఇపుడు శాసనం కాదు. ఆయన స్వయంగా అభ్యర్థి పేరు ప్రకటించినా, అసంతృప్తి గుప్పున లేచింది. చాలా మంది అధికారిక అభ్యర్థికి ప్రచారం చేయమన్నారు. చాలా నియోజకవర్గాలలో తిరుగుబాటు మొదలయింది. తెలంగాణ ‘జాతిపిత’ గా పేరున్న కెసియార్ ప్రకటించినా అసమ్మతి ఏమిటి. స్వయాన ఉపము ఖ్య మంత్రి కడియం శ్రీహరి కూడా ఆఫిషియల్ క్యాండిడేట్ మీద అసంతృప్తి ప్రకటించారు. ప్రస్తుతానికి శ్రీహరి రాజీకొచ్చినా, లోన గాయం సలుపుతూనే ఉంటుంది. ఇలాంటి వాళ్లు చాలా మంది ఉన్నారు. కెసియార్ ఇమెజ్ మసక బారుతున్నదనేందుకు ఇదొక సంకేతం.
ఇక చాలా నియోజకర్గాలలో టిఆర్ ఎస్ అభ్యర్థులను ఏం చేశావని వోటడగుతున్నావని నిలదీస్తున్నారు. తెలంగాణ ఉద్యమం నడిపి విజయవంతమయిన ఒక నాయకుడికి నాలుగున్నర సంవత్సరాల్లోనే ఇంత వ్యతిరేకత రావడం ఏమిటి? ఈ వ్యతిరేకత ఎంత లోతుగా ఉందనేది ఇప్పుడే చెప్పలేం. 2018 2014 కాదనేది స్పష్టం. దానికితోడు చచ్చిపోయిందునుకున్న టిడిపి బతికింది. బరిలోకి వచ్చింది. ఇది కూడా కెసియార్ వ్యూహం పూర్తిగా పనిచేయలేదనేందుకు మరొక నిదర్శనం. ఈ టిడిపి ఇపుడు కాంగ్రెస్ తో కలిసి సై అంటున్నది.
ఈ వాతావరణంలో తెలంగాణ యోధుడు కెసియార్ గజ్వేల్ నుంచి నామినేషన్ వేస్తున్నారు. అయనకు మానవాతీత శక్తుల మీద చాలా నమ్మకం. ఇవన్నీ కూడా ఏవో దారికి గ్రహాలు, శక్తుల పని అని ఆయన విశ్వసిస్తున్నారు. అందుకే నామినేషన్ గడియ నాటికి ఇలాంటి గ్రహాలను, శక్తులను దారికి తెచ్చుకునే పనిలో పడ్డారు.అపుడే ఆయన రికార్డు మెజారిటీ తెచ్చుకోగలరు.
కెసియార్ మహానేత కావచ్చు. కాని 2014 ఎన్నికల్లో ప్రతిఫలించలేదు. ఆయన పార్టీ లాగే ఆయన స్వయంగా ఎన్నికల్లో తిరుగులేని మెజారిటీతో గెలవలేదు. ఆయనకు వచ్చినవోట్లు కేవలం 86,669 మాత్రమే. ఆయన ప్రత్యర్థి ఎవరనుకుంటున్నారు, తెలంంగాణ ద్రోహి అని కెసియార్ ఎపుడూ చెప్పే టిడిపి అభ్యర్థి ఒంటేరు ప్రతాప్ రెడ్డి. ఆయనకు వచ్చిన వోట్లు 67,303. ఇక కాంగ్రెస్ అభ్యర్థి తూంకుట నర్సారెడ్డికి 34,085 ఓట్లు. అంతిమంగా కెసియార్ కు వచ్చిన మెజారిటీ కేవలం 19,391 ఓట్లు మాత్రమే. టిడిపి, కాంగ్రెస్ లకు పడిన వోట్లన్నీ ‘పచ్చి కెసియార్’ వ్యతిరేక వోట్లు. ఎందుకంటే, తెలంగాణ తెచ్చిన మహానేతకు వ్యతిరేకంగా వారంతా ఒక స్టాండ్ తీసుకుని టిడిపికో కాంగ్రెస్ కో వోటేశారు. ఇది గమనించాలి. గజ్వేల్ కెసియార్ గెల్చినా ఆయనకు వ్యతిరేకంగా వోటేసినవారే ఎక్కువ. గజ్వేల ప్రాంతంలో ఇప్పటి అశాంతికి కారణం కూడా ఇదే. కెసియార్ వ్యతిరేక వోట్లు లెక్క ప్రకారం ఇపుడు కూడా ఇంటాక్ట్ గా ఉండాలి. ఉంటే టిడిపి మద్దతుతో పోటీ చేస్తున్న కాంగ్రెస్ అభ్యర్థి ఒంటేరు ప్రతాప్ రెడ్డి సునాయాసంగా గెలవాలి. అపుడు కాంగ్రెస్ , టిడిపిలకు వచ్చిన ఓట్లు లక్షకు పైబడి ఉన్నాయి. ఇది ప్రమాదకరమయిన లెక్కాచారమే. దీని మీద నమ్మకంతోనే ఒంటేరు ముందుకు సాగుతున్నారు.
గత సార్వత్రిక ఎన్నికల్లో నామినేషన్‌కు ముందు సిద్దిపేట నియోజకవర్గంలోని కోనాయపల్లి వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకున్నారు. ఈసారి కూడా ఆయన కోనాయపల్లి స్వామిని దర్శనం చేసుకుని నామినేషన్ వేసేందుకు ర్యాలీగా బయలు దేరతారని అంటున్నారు.
పార్టీ గెలుపుకోసం మూడు రోజుల పాటు యాగాలుచేయబోతున్నారని వార్తలొస్తున్నాయ. గతంలో ఆయన ‘అయుత చండీయాగం జరిపించారు. అయినా రాజకీయాలలో ఆయనకు వ్యతిరేకత తగ్గడం లేదు. ఇప్పుడు ఇంకా బలమయిన యాగం తలపెట్టారని చెబుతున్నారు. దీనికోసం ఆయన శంషాబాద్ మండలం ముచ్చింతలలోని తన అధ్యాత్మిక గురువు చినజీయర్‌స్వామి దివ్యసాకేతాశ్రమం సందర్శించారు. అక్కడి వేదపండితులతో దీనిపై సంప్రదింపులు జరిపారని మీడియా కథనం. ఎర్రవల్లిలోని తన వ్యవసాయ క్షేత్రంలో గానీ, చిన్న జీయర్ స్వామి ఆశ్రమంలోగానీ ఈ హోమాల్ని నిర్వహించవచ్చని అంటున్నారు. అశ్రమం ఆలయ మూలవిరాట్ కోదండరాముని దీవెనలు అందుకున్నారు. ఆలయంలో చినజీయర్‌స్వామి స్వీయ పర్యవేక్షణలో ముఖ్యమంత్రితో శాస్త్రో క్తంగా ప్రత్యేక ఎన్నికల అర్చనలు జరిపించారు. ఆశ్రమంలో స్వామిజీతో సీఎం కేసీఆర్ దాదాపు రెండుగంటలపాటు గడిపినట్లు తెలుస్తున్నది. ఈ ఎన్నికల్లో గ్రహాల మద్దతుతో ఆయన మహాకూటమిని మట్టి కరిపించాలనుకుంటున్నారు.